Visa: హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌-4 వీసాలపై బిల్లు

అమెరికాలో హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌ వర్క్‌ రైట్‌ను కల్పించే బిల్లును ఇద్దరు చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులతో

Published : 08 Apr 2022 14:18 IST

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌ వర్క్‌ రైట్‌ను కల్పించే బిల్లును ఇద్దరు చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులు, వారి భాగస్వాములకు ప్రయోజనం చేకూరడటమే గాక, అగ్రరాజ్యంలో కార్మిక కొరతకూ పరిష్కారం లభించనుంది.

అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్‌ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లయితే ఏడాదిపైనే పట్టొచ్చు.

దీనివల్ల హెచ్‌-4 వీసాదారులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు, అమెరికాలోనూ గత కొంతకాలంగా ఉద్యోగుల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌ కల్పించేలా ఓ బిల్లును రూపొందించి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, ఇకపై హెచ్‌-4 వీసాదారులు పని అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో వలసదారులకు ప్రయోజనం చేకూరడటంతో పాటు అమెరికాలోనూ కార్మిక కొరత తీరే అవకాశముందని చట్టసభ్యులు భావిస్తున్నారు.

ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా వెళ్లే వలసదారులకు ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా భారతీయ మహిళలే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని