Updated : 07/01/2021 16:56 IST

‘క్యాపిటల్‌’ దాడి: ట్రంప్‌పై వేటు తప్పదా?

అవకాశాలను పరిశీలిస్తున్న కేబినెట్‌!

వాషింగ్టన్‌: మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని వీడబోయే డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మారింది. తాజా ఘటనతో అటు డెమొక్రాట్లతో పాటు సొంత పార్టీలోని నేతల నుంచి కూడా ట్రంప్‌పై వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ట్రంప్‌ కేబినెట్‌ భావిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ను తొలగించే అంశంపై సాధ్యాసాధ్యాలను కేబినెట్‌ సభ్యులు చర్చిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

వేటుకు అవకాశం ఉందా..?

అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి అభిశంసన తీర్మానం.. రెండోది అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికారం. ఈ రెండింటిలో ఏ ప్రక్రియ జరిగినా.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంతవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష హోదాలో తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 25వ సవరణ అధికారంపై కేబినెట్‌ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం. ట్రంప్‌ పాలనపై నియంత్రణ కోల్పోయారని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నట్లు రిపబ్లికన్‌ నేతలు చెప్పడం గమనార్హం.

భంగపాటు తప్పదా..!

కొత్తగా ఎన్నికైన జో బైడెన్‌ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే ఎన్నికల్లో తన ఓటమిని ఇంతవరకూ ఒప్పుకోని ట్రంప్.. శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించట్లేదు సరికదా.. బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్‌ నేతల మద్దతు కూటగట్టుకునే ప్రయత్నం చేయగా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఇలాంటి సమయంలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడంతో ఆయనపై వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. దీంతో జనవరి 20 కంటే ముందే ఆయనను పదవి నుంచి తొలగించాలని యూఎస్‌ కేబినెట్‌ మంతనాలు జరుపుతోంది. అదే జరిగితే ట్రంప్‌నకు అవమాన భారం తప్పదు. 

ఏమిటీ 25వ సవరణ?

1963లో నాటి అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ హత్య తర్వాత అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణ తీసుకొచ్చారు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా.. పదవిని స్వచ్ఛందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో ఈ సవరణ అమల్లోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు, కేబినెట్‌ కలిసి అధ్యక్షుడిని తొలగించే అధికారం ఉంటుంది. అప్పుడు ఉపాధ్యక్షుడు కేబినెట్‌కు నాయకత్వం వహించి ఓటింగ్‌ నిర్వహించాలి. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించే స్థితిలో లేరంటూ ఉపాధ్యక్షుడు, మెజార్టీ కేబినెట్‌ నిర్ణయిస్తే ఆయనను పదవి నుంచి తప్పించే వీలుంటుంది. 

అభిశంసన ఎలా..

అధ్యక్షుడిని తొలగించేందుకు మరో మార్గం అభిశంసన తీర్మానం. నిజానికి ఈ అవకాశం కాంగ్రెస్‌ ప్రతినిధుల సభకు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు దుశ్చర్యలు, నేరాలకు పాల్పడినప్పుడు 435 మంది ఉన్న ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్‌ నిర్వహిస్తారు. సాధారణ మెజార్టీతో ఈ తీర్మానం నెగ్గితే దాన్ని ఎగువ సభ అయిన సెనెట్‌కు పంపుతారు. అక్కడ అధ్యక్షుడి తప్పిదంపై విచారణ జరుగుతుంది. ఆ తర్వాత సెనెట్‌లోని 2/3 మెజార్టీతో అధ్యక్షుడిని తొలగించొచ్చు. ఇదంతా ఒక్క రోజులోనే జరగొచ్చు.

ట్రంప్‌పై గతంలోనూ అభిశంసన..

2019లో ట్రంప్‌పై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్‌పై దర్యాప్తు జరపాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారంటూ దిగువ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డెమొక్రాట్ల బలం ఎక్కువగా ఉండటంతో అక్కడ అభిశంసన నెగ్గింది. అయితే, 2020 ఫిబ్రవరిలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్న సెనెట్‌లో ట్రంప్‌ నిర్దోషిగా తేలడంతో అభిశంసన వీగిపోయింది. 

ఇవీ చదవండి..

‘క్యాపిటల్‌’ కాల్పుల ఘటన: నలుగురి మృతి

ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా లాక్‌
 


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని