
ఆందోళనలో అగ్రరాజ్యం!
బైడెన్ ప్రమాణస్వీకారానికి ముందు అల్లర్లు జరిగే అవకాశం?
వాషింగ్టన్: కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో గంభీర వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్ డి.సిలో వీధులన్నీ భద్రతా బలగాలతో నిండిపోతున్నాయి. ఇంకా ఆయా రాష్ట్రాల నుంచి దళాలు వచ్చి చేరుతున్నాయి. అలాగే 50 రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ వాతావరణం వేడెక్కింది. క్యాపిటల్ భవనాలపై అనునిత్యం నిఘా కొనసాగుతోంది.
ట్రంప్ మద్దతుదారులు ఎక్కడ మరోసారి బీభత్సం సృష్టిస్తారోననే అనుమానంతో అన్ని వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ ఇచ్చిన హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాళ్లు రువ్వడం దగ్గరి నుంచి బాంబులు పేల్చడం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలైనా చోటుచేసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రమాదాల్ని అరికట్టాలని భద్రతా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మిషిగన్, వర్జీనియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే ఫెడరల్ బలగాల్ని రంగంలోకి దించారు. మరికొన్ని రాష్ట్రాలు ఈ బాటలో పయనించనున్నాయి. జనవరి 6వ తేదీన దుండగులు క్యాపిటల్ భవనంపై జరిపిన దాడిని స్ఫూర్తిగా తీసుకొని మరోసారి రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి అల్లర్లకు ఉసిగొల్పే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఇప్పటికే వాషింగ్టన్లో ఆత్యయిక స్థితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన కూడళ్లు, రెస్టారెంట్లు, చారిత్రక ప్రదేశాలు, ఫెడరల్ భవనాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న అతివాదులే దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వీరంతా రోడ్లపైకి వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా ర్యాలీలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..