US Covid Deaths: అమెరికాలో చలికాలంలో కొవిడ్‌ మరణాలు తగ్గొచ్చు

అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, రానున్న చలికాలంలో దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా...

Updated : 11 Oct 2021 10:18 IST

వాషింగ్టన్‌: అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, రానున్న చలికాలంలో దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య తగ్గుతున్నట్లే.. మరణాలూ తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎంత త్వరగా, కచ్చితంగా తగ్గుతాయనేది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. చల్లని వాతావరణం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం.. సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మార్గదర్శకాలను ఎంతమేర పాటిస్తారు.. తదితర అంశాలు ఈ పరిస్థితులను ప్రభావితం చేస్తాయని ఫౌచీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. టీకా తీసుకున్న వారు కూడా బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్కు ధరించాలని సూచించారు.

‘డెల్టా వేరియంట్‌ ముప్పు కొనసాగుతోంది’

‘అదృష్టవశాత్తూ.. కొన్ని వారాలుగా అమెరికాలో కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. మరణాలు కొనసాగుతోన్నా.. ఒకే స్థాయిలో నమోదవుతున్నాయి’ అని ఫౌచీ వెల్లడించారు. మరోవైపు డెల్టా వేరియంట్‌ ముప్పు ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. జూన్‌లో కొత్త కేసుల వాటాలో 13.5 శాతంగా ఉన్న డెల్టా వేరియంట్‌.. సెప్టెంబరు నాటికి 98 శాతానికి పెరిగినట్లు గుర్తుచేశారు. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 4.43 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 7.13 లక్షలు దాటింది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల పౌరులకు టీకా ఆవశ్యకతకు మరోసారి గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని