‘వద్దిపర్తి’ సప్త ఖండ అవధాన సాహితీ ఝరి.. ఘనంగా విజయోత్సవ సభ

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ చేపట్టిన ‘సప్త

Published : 30 May 2022 14:13 IST

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ చేపట్టిన ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ ప్రక్రియలో భాగంగా 14వ అవధానం పూర్తయింది. తెలుగు భాషకి అత్యున్నత వైభవం అయిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ కొత్త ఆలోచనకి వద్దిపర్తి పద్మాకర్‌ శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగా ప్రతి నెలా ఒక్కో ఖండం చొప్పున దాదాపు 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు దీనిలో పాల్గొనగా.. వర్చువల్‌గా 13 అష్టావధానాలను వద్దిపర్తి పద్మాకర్‌ పూర్తి చేశారు. మే 29న 14వ అవధానం కూడా పూర్తయింది. ఇందులో సప్త ఖండాల నుంచి 11 మంది పృచ్ఛకులు పాల్గొని విజయవంతం చేశారు. దీనిలో భాగంగా అదేరోజు ఏలూరులోని శ్రీ ప్రణవ పీఠంలో వద్దిపర్తి పద్మాకర్‌ ‘అవధాన సాహితీ ఝరి’ విజయోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, జీవన సాఫల్య పురస్కార సభ నిర్వహించారు. ఈ మేరకు ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు కృష్ణ పద్మ (టెక్సాస్‌, అమెరికా) తెలిపారు.

ఈ అవధానంలో పృచ్ఛకులుగా ఆస్ట్రేలియా ఖండం నుంచి న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ తరఫున గోవర్ధన్‌ మల్లెల, ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు సీతారామరాజు, ఐరోపా నుంచి తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (టీఏఎల్‌) వైస్‌ ఛైర్మన్‌, కోశాధికారి రాజేశ్‌ తోలేటి, ఆసియా ఖండం నుంచి సింగపూర్ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు రత్నకుమార్‌ కవుటూరి, ఖతార్‌ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు తాతాజీ ఉసరికల, సౌమ్య కంతేటి, మలేసియా తెలుగు అసోసియేషన్‌ నుంచి సత్యాదేవి మల్లుల.. ఉత్తర అమెరికా నుంచి అమెరికాలోని రామచంద్రరావు తల్లాప్రగడ, కెనడా నుంచి తెలుగుతల్లి కెనడా మాసపత్రిక ఎడిటర్‌ లక్ష్మీ రాయవరపు, దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ నుంచి రంగారెడ్డి బద్దం పాల్గొన్నారు. ఆస్ట్రేలియా నుంచి అవధాన శారదామూర్తి, తటవర్తి, కల్యాణ చక్రవర్తి అవధాన సంచాలకత్వం చేశారు.

ప్రణవ పీఠానికి విశిష్ట అతిధులుగా సాహితీ ప్రముఖులు వంశీ రామరాజు, సినీ గేయరచయిత భువనచంద్ర, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు మా శర్మ, సినీ గేయరచయిత వడ్డేపల్లి కృష్ణ హాజరయ్యారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షులు చిట్టెన్‌రాజు (అమెరికా), ఘంటసాల పార్వతి, పెరుంగో సిస్టమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్వామి నారాయణ (కెనడా) తదితరులు జూమ్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ‘సప్తఖండ అవధాన సాహితీ ఝరి’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సద్గురు ఘంటసాల శతజయంతి వంశీ- శుభోదయం సాహితీ పురస్కారం 2022’ను వద్దిపర్తి పద్మాకర్‌కి ప్రదానం చేశారు.

వద్దిపర్తి పద్మాకర్‌ ఏడు ఖండాల్లో జరిగిన 14 అవధానాలతో కలుపుకొని ఇప్పటి వరకు 1244 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు.. తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేశారు. ఆయనలోని  అసాధారణమైన ప్రతిభను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని