మెల్‌బోర్న్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

తెలుగు విద్యార్థి సంఘం ఏఏ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలోని మోనాష్ యూనివర్సిటీలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు...

Published : 06 Sep 2022 22:05 IST

మెల్‌బోర్న్‌: తెలుగు విద్యార్థి సంఘం ఏఏ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలోని మోనాష్ యూనివర్సిటీలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధోల్ బృందం చేసిన డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతీయువకులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, స్థానిక పార్లమెంట్ సభ్యులు పాల్గొని గణనాథుడిని దర్శించుకొన్నారు. తెలుగు సాంస్కృతిక వైభవంతో పాటు ప్రజల ఐక్యతను చాటి చెప్పేలా వైభవంగా వేడుకలను నిర్వహించిన ఏఏ విద్యార్థి సంఘం సభ్యులను మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. వేడుకలు ముగిసిన అనంతరం నిర్వహించిన లడ్డూల వేలం పాటలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం మూడు లడ్డూలకు వేలం నిర్వహించగా.. వాటిలో 5కేజీల లడ్డూను రూ. 2.51 లక్షలకు, 11 కేజీల లడ్డూను రూ. 4.13లక్షలకు, 21 కేజీల లడ్డూను రూ.5.72 లక్షలకు పలువురు స్థానిక తెలుగువారు సొంతం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని