Updated : 02 May 2022 12:19 IST

USA: వీసా ఉంటే ఆగస్టు నుంచి అమెరికాకు

ప్రయాణానికి మూడు రోజుల ముందు కొవిడ్‌ పరీక్ష

విద్యార్థులకు ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ తరగతులు

‘ఈనాడు’తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌

ఈనాడు - హైదరాబాద్‌

‘అమెరికాలో చదువుకోవాలనుకునే వారిపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వీసా ఉన్న వారు ఆగస్టు ఒకటో తేదీ లేదా ఆ తరవాత నుంచి అమెరికా వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రస్తుతం అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గిన తరవాత వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. అమెరికా వెళ్లే విద్యార్థులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అవసరమా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయం’ అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ చెప్పారు. వీసా జారీ ప్రక్రియను నిలిపివేయటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో సోమవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. 

అమెరికాలో చదువుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆగస్టులో వెళతారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి వీసాలు ఇవ్వటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కరోనా పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విద్యార్థి వీసా ప్రక్రియను ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన తాజా సమాచారం కోసం అమెరికా రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాల వెబ్‌సైట్లను తరచూ చూస్తూ ఉండాలి. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే విద్యార్థి వీసా(ఎఫ్‌-1), స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌ వీసా(ఎం-1) ఉన్నవారు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులకు హాజరయ్యేందుకు అమెరికా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆ మేరకు ఇంతకు మునుపే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అమెరికా వెళ్లే విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి సూచనలు చేస్తారు?

విద్యార్థుల సౌలభ్యం కోసం అమెరికాలోని కొన్ని వర్సిటీలు పూర్తిగా ఆన్‌లైన్‌, మరికొన్ని హైబ్రిడ్‌ విధానాల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గేంత వరకు హైబ్రిడ్‌ పద్దతిలో ఆన్‌లైన్‌ ద్వారా కోర్సులు నిర్వహిస్తారు. ఆపై మిగిలిన భాగాన్ని అమెరికాలో పూర్తిచేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విషయంలో మరిన్ని మార్గదర్శకాల కోసం మీకు సమీపంలో ఉన్న ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ కేంద్రాలను సంప్రదించవచ్చు.

విద్యార్థి వీసా(ఎఫ్‌-1)పై అమెరికా వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్న ప్రచారం వాస్తవమేనా?

విద్యార్థులు, ఇతరులు వ్యాక్సిన్లు వేయించుకోవాలా? వద్దా? అన్నది విశ్వవిద్యాలయాలు, స్థానిక ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు విద్యార్థులు వారు చేరబోయే విశ్వవిద్యాలయాలను సంప్రదించాలి.  ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం మాకు లేదు. వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు, ఇతరులు బయలుదేరటానికి మూడు రోజుల ముందు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకుని వ్యాధి లేదన్న నిర్ధారణ పత్రాలు విమానం ఎక్కే ముందు ఆయా సంస్థలకు అందచేయాలని అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఇంకా అమలులో ఉన్నాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారు సంబంధిత పత్రాలను విమానయాన సంస్థకు అందచేయాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రవేశించటానికి కరోనా పరీక్షలకు సంబంధించి సమాచారాన్ని https://travel.state.gov/content/travel/en/traveladvisories/ea/covid-testing-required-us-entry.html లో చూసుకోవచ్చు. అమెరికాలోని సరిహద్దు భద్రతకు వ్యవహారాల నిబంధనలకు సంబంధించిన సమాచారం కోసం cbp.gov చూడాలి.

రానున్న రోజుల్లో వీసాల జారీకి ఎలాంటి ప్రాధాన్యం  ఇస్తారు?

అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన వారు, యూఎస్‌ పౌరుల విషయంలో వీసా విభాగంతో సంబంధం లేకుండా జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. వారు చేయాల్సిందల్లా సాధ్యమైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక కార్మికులు, వివిధ కారణాలతో ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయిన వారి దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత నేపథ్యంలో దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించలేకపోతున్నాం. పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను సమీక్షించే సామర్థ్యాన్ని సాధ్యమైనంత వేగంగా పెంచేందుకు యోచన చేస్తున్నాం. ప్రస్తుతం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, కోల్‌కతాలలోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో వలసేతర(నాన్‌-ఇమిగ్రెంట్‌) వీసాల జారీ  పరిమితంగా సాగుతోంది.

కొన్ని వర్సిటీలు జులైలోనే తరగతులను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే వీసాలు ఉన్న విద్యార్థులు అమెరికా వెళ్లవచ్చా?

వీసా ఉన్నా, జులైలో తరగతులు ప్రారంభం అయ్యే పరిస్థితి ఉన్నా ముందుగా అమెరికాలోకి అనుమతించేందుకు అవకాశం లేదు. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులకు హాజరయ్యే విద్యార్థులు, ఆ తరగతులు మొదలయ్యే 30 రోజుల ముందు మాత్రమే అనుమతిస్తారు.   తరగతులకు హాజరు కావాలని ఐ-20లో నమోదు చేసి ఉంటే ముందుగానే విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు చేసుకుని ఆగస్టు ఒకటో తేదీ నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts