Vedant Patel: ఆయన టాలెంట్‌ అమోఘం.. రోజూ బైడెన్‌కు సహకరిస్తుంటారు..!

అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు.

Updated : 08 Apr 2022 13:12 IST

శ్వేతసౌధంలో ప్రవాస భారతీయుడిపై ప్రశంసలజల్లు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయులు కీలక స్థానాల్లో కొలువుదీరి, ఆ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన హయాంలో భారతీయ అమెరికన్లకు పెద్దపీటే వేశారు. వారంతా శ్వేతసౌధంలో అధ్యక్షుడి కార్యకలాపాలు సజావుగా సాగేలా.. చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకరే వేదాంత్ పటేల్‌. ఆయన శ్వేతసౌధంలో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయనపై ప్రెస్ సెక్రటరీ జెన్‌ సాకీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనో అద్భుతమైన రచయితని, నిత్యం బైడెన్‌తో సహా తమకు సహకరిస్తుంటారని అభినందించారు.

‘మీకు సులభమైన పని అప్పగించామంటూ తరచూ మేం వేదాంత్‌ను ఆటపట్టిస్తుంటాం. కానీ అలా ఏముండదు. ఆయన సూపర్ టాలెంటెడ్‌ కాబట్టి, పని సులభంగా మారుతుంటుంది. ఆయన గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలా అందంగా రాస్తారు. అంతే వేగంగా కూడా పనిచేస్తారు. ఆయనకు ప్రభుత్వంలో మున్ముందు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. ప్రతిరోజు అధ్యక్షుడికి, మాకు సహకరించే విషయంలో ఆయన వ్యవహరించే తీరు అద్భుతం’ అంటూ జెన్‌సాకీ మెచ్చుకున్నారు. 

ఈ వేదాంత్ ఎక్కడివారు..?

వేదాంత్‌ పటేల్‌(32) స్వరాష్ట్రం గుజరాత్‌. వేదాంత్ పుట్టిన తర్వాత ఆయన కుటుంబం కాలిఫోర్నియాకు వలస వెళ్లింది. అక్కడే తన  విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (రివర్‌సైడ్) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఎంబీఏ పట్టా పొందారు. శ్వేతసౌధంలో అసిస్టెంట్‌ మీడియా సెక్రటరీగా చేరకముందే.. ఎన్నికల ప్రచారంలో బైడెన్‌తో కలిసి పనిచేశారు. 2012లో మాజీ చట్టసభ సభ్యుడు మైక్ హోండా వద్ద డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి, ఇప్పుడు బైడెన్‌కు అడుగడుగునా సహకరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రశ్నలకు ఈయనే బదులిస్తారు.

‘1991లో మా కుటుంబం గుజరాత్‌ నుంచి ఇక్కడకు వచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కృషి వల్లే ఈ రోజు నేను శ్వేతసౌధంలో కూర్చొని పనిచేస్తున్నాను’ అంటూ గతంలో చేసిన ట్వీట్‌లో వేదాంత్‌ తన మూలాలను గుర్తుచేసుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని