Published : 19/01/2021 01:10 IST

చీరకట్టుతో కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ మూలాలున్న కమలా హారిస్‌.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేవలం రెండే రోజుల వ్యవధి ఉంది. కట్టుదిట్టమైన భద్రతా నిబంధనల నడుమ బుధవారం జరగనున్న ఈ కార్యక్రమంలో ఆమె ఏం ధరిస్తారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల సందర్భంగా కమల తన భారతీయ మూలాలను పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె చీరను ధరించి అధికారాన్ని స్వీకరిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

కమల చీర కట్టుకుంటారా?

2019లో ఓ ఎన్నికల సమావేశం సందర్భంగా విజయం సాధిస్తే చీర కట్టుకుంటారా అని కమలను ప్రశ్నించినప్పుడు.. ముందు గెలుద్దాం అని ఆమె సమాధానమిచ్చాట. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల తమకు అమిత గౌరవం ఉండేలాగ తన తల్లి తమను పెంచారని.. ఇంటిపేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకొంటామని కూడా ఆమె అన్నారట. కమల తల్లి శ్యామలా గోపాలన్‌ చెన్నైలో పుట్టి పెరిగి.. అమెరికాకు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. చీరను ధరించటం చేయటం ద్వారా ఆమెకు మరింత నైతిక బలం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మేడం వైస్‌ ప్రెసిడెంట్‌.. అది నాకు గౌరవం

అధికార స్వీకరణ సమయంలో మేడం వైస్‌ ప్రెసిడెంట్‌ చక్కటి బెనారస్‌ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని.. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ బిబు మొహాపాత్ర ఇటీవలి ఇంటర్వూలో చెప్పారు. ఆ ముఖ్య సందర్భంలో ఆమెకు వస్త్రాలంకరణ చేయటం తనకు ఎంతో గౌరవకారకమని కూడా ఒడిషాకు చెందిన ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. దీనితో కమల ‘ఆరుగజాల వస్త్ర విశేషం’ అయిన చీరలో కనిపించవచ్చనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఒక్క సెకెనున్న వీడియోతో..

56ఏళ్ల ఈ రాజకీయవేత్త, నిజానికి ఎన్నో ఏళ్లుగా ఫార్మల్‌ సూట్లనే ధరిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడు కూడా ఆమె అదే అలవాటును కొనసాగిస్తారనే వారూ లేకపోలేదు. ఇక ఆమె ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదనే వారూ లేకపోలేదు. ఐతే ఈ అభిప్రాయం తప్పని ఒక్క సెకెను కంటే తక్కువ నిడివిగల ఓ సోషల్‌ మీడియా పోస్టు ద్వారా రుజువైంది. కమల సమీప బంధువు మీనా హారిస్‌ ఇటీవల ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ‘‘ఫ్యూచర్‌ ఈజ్‌ ఫిమేల్‌’’ (ఆడవారిదే భవిష్యత్తు) అని రాసి ఉన్న సాక్సులను హారిస్‌ ధరించటం చూడవచ్చు. దీనితో సంబంధిత కంపెనీ సాక్సులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగి.. స్టాకు అందుబాటులో లేకుండా పోయిందట.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తొలి మహిళగానే కాకుండా నల్లజాతీయురాలిగా, దక్షణాసియా మూలాలున్న వ్యక్తిగా కూడా కమలా హారిస్‌ నిలిచిపోనున్నారు. ఆ చారిత్రాత్మక సమయంలో ఆమెకు సంబంధించిన చిన్న అంశమైనా పెద్ద ప్రభావాన్నే కలుగచేస్తుందనే విషయంలో సందేహం లేదు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ చీరకట్టు, అమెరికాలో ఉండే మైనారిటీల ప్రతినిధిగా ప్రపంచానికి ఓ చక్కటి సందేశాన్నిస్తుందని పరిశీలకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

బైడెన్‌-హారిస్‌కు ముగ్గులతో స్వాగతం

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

REDIS