
అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!
కరోనా విజృంభణపై ఫౌచీ ఆందోళన
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే రోజుల్లో కరోనా భారీ స్థాయిలో విజృంభించనుందని ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవులు ముగిసిన తర్వాత కరోనా కేసులు భారీ స్థాయిలో రికార్డు కానున్నాయని తెలిపారు. కాబోయే అధ్యక్షుడు బైడెన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. త్వరలో అమెరికాలో మరిన్ని ‘చీకటి రోజులు’ రానున్నాయని బైడెన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. కేసుల విజృంభణను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకాను ఇటీవల ఫౌచీ తీసుకున్న విషయం తెలిపిందే. టీకా వేసుకున్న తర్వాత తనలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని.. ఆరోగ్యం సజావుగానే ఉందని తెలిపారు.
పండుగ సెలవుల నేపథ్యంలో అమెరికాలో ప్రయాణాలు భారీగా పెరిగాయి. కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ఈ పరిణామం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతవారం రోజుకి సగటున దాదాపు పదిలక్షల మంది ప్రయాణించారు. ఇప్పటికే గతనెల ‘థ్యాంక్స్ గివింగ్’ సెలవుల తర్వాత కేసులు రికార్డు స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఈ నెలలో రోజుకి సగటున రెండు లక్షల కేసులు.. 3000 మరణాలు నమోదయ్యాయి. తాజా క్రిస్మస్, కొత్త ఏడాది సెలవులు ముగిసిన తర్వాత కూడా మరోసారి కేసులు తారస్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
మరోవైపు అమెరికా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఫైజర్, మోడెర్నా అభివృద్ధి చేసిన టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది టీకా వేయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి రెండు కోట్ల మందికి టీకా అందజేస్తామని అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 1,91,31,151 కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,33,115 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.