Meghalaya: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ కుదుపు: టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద కుదుపు. ఆ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది బుధవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 25 Nov 2021 17:13 IST

న్యూదిల్లీ: మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద కుదుపు. ఆ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది బుధవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా ఉండడం కూడా గమనార్హం. ఈ విషయాన్ని తృణమూల్‌ పార్టీ నేతలు వెల్లడించారు. తృణమూల్‌లో చేరడంపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా కాంగ్రెస్‌  ఎమ్మెల్యేల చేరికతో రాత్రికే రాత్రే తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షపార్టీగా అవతరించింది. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది.   

వరుసుగా మూడోసారి బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ వార్త మరింత ఊత్సాహాన్ని ఇవ్వనుంది. గతకొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీపై ముకుల్‌ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనునూయులతో కలిసి తృణమూల్‌లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరోవైపు  తృణమూల్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మీరు కలవనున్నారా’ అని విలేకరులు అడగడంతో లేదని బదులిచ్చారు. దిల్లీకి వచ్చిన ప్రతిసారీ మేము సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదని మమతా చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమత బెనర్జీకి మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.  

నేతల చేరికలతో పార్టీ విస్తరణ.. 

గత కొద్దినెలలుగా పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో ఉన్న టీఎంసీ పలువురు కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌, రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన అశోక్‌ తన్వర్‌లు మమతా బెనర్జీ సమక్షంలో ఆపార్టీలో చేరారు. గత సెప్టెంబర్‌లో గోవా మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ బలమైన నేత లుజినో ఫలైరో తృణమూల్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా టీఎంసీలో చేరారు. వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ బలాన్ని పెంచే దిశగా మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు. గోవాలో గెలుపే లక్ష్యంగా మమతా పావులు కదుపుతున్నారు. 

ఎమ్మెల్యేలు పార్టీ మారారని వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మనీష్‌ ఛత్రత్‌ ఈ రోజు మేఘాలయ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ మొదటి వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన గుజరాత్‌ వెళ్లాల్సి ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని