రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం: విపక్షాలు!

పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల చేస్తోన్న ఆందోళనలకు.....

Published : 28 Jan 2021 19:03 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడి

దిల్లీ: పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల చేస్తోన్న ఆందోళనలకు సంఘీబావంగా దాదాపు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆజాద్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో కేంద్ర ప్రభుత్వ పాత్రపైనా విచారణ జరపాలని ఈ 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దురదృష్టకరం: ప్రహ్లాద్‌ జోషి
రైతుల ఆందోళనకు సంఘీబావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరిస్తామని ప్రకటించడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. రాష్ట్రపతి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని, ఆయన ప్రసంగాన్ని బహిష్కరించాలనే ఆలోచనపై పునరాలోచన చేయాలని విపక్షాలను కోరారు. అయినా, సాగు చట్టాలపై ఉభయ సభల్లో కూలంకషంగా చర్చ జరిగిన తర్వాతే చట్టాలు చేశామని, మేనిఫెస్టోలో తాము చెప్పిందే చేస్తూ వస్తున్నామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో విమర్శలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఏ విషయం అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇవీ చదవండి..
దిల్లీ ఘటన: దీప్‌ సిద్ధూ ఎక్కడ?
రైతు నేతలపై లుకౌట్‌ నోటీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని