AP Assembly: కొలువుదీరిన కొత్త సభ

కొత్త శాసనసభ కొలువు తీరింది. పదహారో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. మరో ముగ్గురు ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు సభా కార్యక్రమాలు మొదలయ్యాయి.

Updated : 22 Jun 2024 07:02 IST

171 మంది సభ్యుల ప్రమాణం
తొలుత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..
తర్వాత మంత్రులు.. జగన్‌మోహన్‌రెడ్డి
ఈనాడు - అమరావతి

శాసనసభలో కొలువుదీరిన సభ్యులు. చిత్రంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు

కొత్త శాసనసభ కొలువు తీరింది. పదహారో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. మరో ముగ్గురు ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. 9.46కు ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరి సభాపతి స్థానంలో కూర్చుని.. సభ్యులతో ప్రమాణం చేయించడం ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రమాణం చేశారు. తర్వాత ఆంగ్ల అక్షరక్రమంలో అనిత, అచ్చెన్నాయడు, భరత్‌.. తదితర మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజుతో ప్రారంభమై.. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో ముగిసింది. కోనేటి ఆదిమూలంతో ప్రారంభమైన పురుష సభ్యుల ప్రమాణం పాడేరు వైకాపా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో ముగిసింది. సభ శనివారం ఉదయం 10.30 గంటలకు వాయిదాపడింది. ప్రమాణ పద్ధతుల్ని బుచ్చయ్యచౌదరి ముందే సభ్యులకు తెలియజేశారు. అందుకు అనుగుణంగా సభ్యులు ప్రమాణం, ప్రతిజ్ఞ చేసి తర్వాత సభాపతి కుర్చీ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. పుస్తకంలో సంతకం చేసిన తర్వాత సభ్యులకు అసెంబ్లీ రూల్‌బుక్, రాజ్యాంగ ప్రతులతో కూడిన బ్యాగ్‌లను అందజేశారు. పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), జీవీ ఆంజనేయులు శనివారం ప్రమాణం చేయనున్నారు.

ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి

నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది

ముఖ్యమంత్రి చంద్రబాబు 9.45 గంటలకు సభలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ‘గౌరవసభకు స్వాగతం’ అంటూ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. తెదేపా, జనసేన సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. భాజపా సభ్యులంతా కలిసి ఉదయం 10 గంటల సమయంలో సభలోకి వచ్చారు. ప్రమాణాల తర్వాత పలువురు సభ్యులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వద్దకెళ్లి   పాదాభివందనం చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాదాభివందనం చేసే సమయంలో ‘మీరు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు..’ అంటూ చంద్రబాబు ఆయనను వారించారు. చంద్రబాబు,  పవన్‌కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ, పల్లా శ్రీనివాసరావు ప్రమాణాలు చేసేటప్పుడు సభ్యులు బల్లలు చరుస్తూ చప్పట్లు కొట్టారు.

జగన్‌మోహన్‌.. అనే నేను

‘వైఎస్‌ జగన్‌మోహన్‌ అనే నేను..’ అంటూ మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణం ప్రారంభించారు. ఆ వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి అంటూ సవరించుకున్నారు. ఆయన గొంతులో కొంత తొట్రుపాటు వినిపించింది. ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు నమస్కరిస్తూ ముందుకు వెళ్లారు. సభాపతి బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లి అభివాదం చేసిన తర్వాత నేరుగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతాలాపన సమయంలోనూ సభలో జగన్‌ లేరు. సభ ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కాగా.. జగన్‌ ఉదయం 10.16 గంటలకు ప్రవేశించారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆయన వద్దకెళ్లి అభివాదం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత మంత్రి సత్యకుమార్‌ కూడా తొలి వరసలోని సభ్యులందరికీ నమస్కరిస్తూ చివరిలో కూర్చున్న జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకెళ్లి కరచాలనం చేశారు.

సభలో ప్రమాణం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంగ్లంలో ప్రమాణం

శాసనసభ్యుల్లో అధికశాతం తెలుగులోనే ప్రమాణం, ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సొంగా రోషన్, కేఈ శ్యామ్, బొజ్జల సుధీర్‌రెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. 

ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్‌ కల్యాణ్‌

విజిటర్స్, మీడియా గ్యాలరీల్లో కేకలు..

ఎమ్మెల్యేల ప్రమాణాల సందర్భంగా.. వారి బంధువులు, అనుచరులు పెద్దఎత్తున తరలివచ్చారు. విజిటింగ్‌ పాస్‌లు ఇవ్వలేమని అధికారులు ముందే చెప్పినా.. ఆగలేదు. విజిటర్స్‌ గ్యాలరీలోకి రద్దీ పెరగడంతో గందరగోళం ఏర్పడింది. భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. బయటకు పంపే ప్రయత్నం చేయగా.. కొందరు కేకలు వేశారు. దీంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సహా సభ్యులందరి చూపు అటు మళ్లింది. మీడియా గ్యాలరీలోకి కూడా ఎమ్మెల్యేల బంధువులు, అనుచరులు రావడంతో కిక్కిరిసింది.

ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్‌ కరచాలనం

మంచి ముహూర్తం కోసం

కొందరు సభ్యులు మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణం చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భాష్యం ప్రవీణ్, రెడ్డప్పగారి మాధవిరెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులు పేరు పిలిచినప్పుడు కాకుండా తర్వాత వచ్చి ప్రమాణం చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కూడా ముహూర్తం కారణంగానే శనివారం ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని