UP Election 2022: నెమ్మదిగా సాగుతోన్న పోలింగ్‌..ఓటర్ల కోసం సెల్ఫీ పాయింట్లు..!

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ నిదానంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 10 Feb 2022 12:32 IST

లఖ్‌నవూ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ నిదానంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నాలుగు గంటల్లో షామ్లి, ముజఫర్‌నగర్‌, బాఘపత్‌, హాపూర్‌లో 22 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అలీగఢ్‌లో 17 శాతం మంది మాత్రమే ఓటేశారు. 

పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ పాయింట్లు..

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కొన్ని కేంద్రాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం గులాబీ రంగు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, ఓటు వేసిన అనంతరం సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేక పాయింట్లు అందుబాటులో ఉంచినట్లు మేరఠ్ డీఎం వెల్లడించారు.  అలాగే ఈవీఎంలలో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించినట్లు చెప్పారు. ముజఫర్‌నగర్‌ పరిధిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడు వివాహ దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

ప్రజలు ఆర్‌ఎల్‌డీకి ఎందుకు ఓటేయాలి: భాజపా

‘జయంత్‌ చౌధరీ ఓటు వేయడానికి రాకుండా, ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆయన ఎంతటి బాధ్యతాయుతమైన వ్యక్తో దీన్ని బట్టే తెలుస్తోంది. ఆయన తన వైఖరితో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఓటు వేసే విషయంలోనే ఆయన సీరియస్‌గా లేనప్పుడు, ప్రజలెందుకు ఆర్‌ఎల్‌డీని పరిగణనలోకి తీసుకోవాలి..?’ అంటూ భాజపా విమర్శలు గుప్పించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు