The Kashmir Files: ‘కశ్మీరీ పండిట్ల క్షోభను భాజపా రూ.200 కోట్లకు విక్రయించింది’

కాశ్మీరీ పండిట్ల క్షోభను రూ. 200 కోట్లకు విక్రయించిందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా దుయ్యబట్టారు.......

Updated : 29 Mar 2022 05:32 IST

దిల్లీ: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలు సినిమాకు ట్యాక్స్‌ రద్దు చేయడాన్ని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా రాష్ట్ర అసెంబ్లీ సెషన్‌లో భాజపాపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల క్షోభను రూ.200 కోట్లకు ఆ పార్టీ విక్రయించిందని దుయ్యబట్టారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి భాజపా ఆలోచిస్తోందని, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కశ్మీరీ పండిట్ల దుస్థితిపై ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. సినిమా వసూలు చేసిన రూ.200 కోట్లను కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని భాజపా ప్రచారం చేస్తోందని.. అలాంటప్పుడు ఈ చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా యూట్యూబ్‌లో విడుదల చేయాలని కోరారు.

ఇటీవల దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దీనిపై మాట్లాడుతూ.. ఆ సినిమాను భాజపా రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఈ 8 ఏళ్ల కాలంలో ఒక్క కశ్మీరీ పండిట్‌ కుటుంబాన్ని అయినా భాజపా కశ్మీర్‌కు తరలించిందా? అని ప్రశ్నించారు. ‘కశ్మీర్‌ఫైల్స్‌’ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిద్వారా వచ్చే డబ్బును కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. భాజపా కార్యకర్తలు ఈ సినిమా పోస్టర్లు అంటించే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. బూటకపు నినాదాలు మానుకోవాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని