2024 General Elections: అలా అయితే భాజపాకు గట్టి పోటీ తప్పదు: శశి థరూర్‌

ప్రతిపక్షపార్టీలన్ని ఒకే అభిప్రాయంతో ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిని నిలబెడితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 General Elections) భాజపా(BJP)కు గట్టి పోటీ తప్పదని కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ (Shashi Tharoor) అన్నారు. 

Published : 18 Feb 2023 01:20 IST

దిల్లీ: 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు (2024 General Elections) ఈ సారి మరింత ఉత్కంఠగా ఉంటాయని కాంగ్రెస్ (Congress) సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశి థరూర్‌  (Shashi Tharoor)అన్నారు. 2019లో గెలిచినట్లుగా ఈ సారి భాజపా (BJP) గెలవలేదని జోస్యం చెప్పారు. విపక్ష పార్టీలు ఏకమై అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అభ్యర్థినే నిలబెడితే.. భాజపాకు గట్టి పోటీ ఇవ్వొచ్చని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కూటమి గురించి మాట్లాడుతూ.. భాజపా తర్వాత కాంగ్రెస్‌కు మాత్రమే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా గుర్తింపు ఉందని, ప్రతిపక్ష పార్టీలను ముందుండి నడిపే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదన్నారు.

గత రెండు దఫా ఎన్నికల్లో భాజపా కేవలం 31, 37 శాతం ఓట్లతో మాత్రమే గెలిచిందని, ప్రతిపక్షాల మధ్య సమన్వయలోపం భాజపాకు వరంగా మారిందని థరూర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ఐక్యత రెండు కోణాల్లో ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడం లేదా పార్టీలు సీట్ల కేటాయింపుపై చర్చించుకుని, భాజపాకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి.. ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడటమని చెప్పారు. 

‘‘ఈ సారి సార్వత్రిక ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశాలు తక్కువనే వారితో నేను ఏకీభవించను. 2019 ఎన్నికల్లో భాజపా గెలిచినా.. ఇప్పటికీ దేశ రాజకీయాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు పార్టీని మరింత బలోపేతం చేశాయని సోనియా గాంధీ (Sonia Gandhi) నాతో చెప్పారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కాంగ్రెస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇమేజ్‌ మరింత పెంచింది. అంతేకాకుండా సవాళ్లను సమర్థంగా అధిగమించగలమనే  ధైర్యం జోడో యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తలకు లభించింది’’ అని థరూర్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని