Eknath Shinde: శిందే శిబిరంలో అసంతృప్తి.. భాజపా వైపు 22మంది ఎమ్మెల్యేల చూపు: ‘సామ్నా’

శిందే శిబిరంలో మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా. వారిలో 22మంది భాజపాలో చేరబోతున్నారంటూ ఉద్ధవ్‌ వర్గానికి చెందిన అధికారిక పత్రిక ‘సామ్నా’ పేర్కొంది.

Published : 25 Oct 2022 02:45 IST

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath shinde) శిబిరంలోని మెజార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. వారంతా త్వరలో భాజపా(BJP)లో చేరబోతున్నారని ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray)సారథ్యంలోని శివసేన ఆరోపించింది. శిందే శిబిరంలో మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా. వారిలో 22మంది భాజపాలో చేరబోతున్నారంటూ ఉద్ధవ్‌ వర్గానికి చెందిన అధికారిక పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. ఏక్‌నాథ్‌ శిందేను సీఎంని చేయడం తాత్కాలిక ఏర్పాటులో భాగమేనని, ఆయన ధరించిన సీఎం యూనిఫాంని ఎప్పుడైనా తొలగిస్తారని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని రాసుకొచ్చింది.

తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో శిందే శిబిరం తన అభ్యర్థిని బరిలో దించాల్సిఉండేదని.. కాకపోతే భాజపానే నిలువరించిందని ప్రత్యేక వ్యాసంలో పేర్కొంది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్టు శిందే చెప్పుకొంటున్నవన్నీ అవాస్తవాలేనంది. శిందే శిబిరంలో కనీసం 22మంది ఎమ్మెల్యేలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని.. వారంతా భాజపాలో చేరబోతున్నారంటూ ఆరోపించింది. శిందే తనకు తానే కాకుండా రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టంచేశారని ‘సామ్నా’ మండిపడింది. శిందేను రాష్ట్రం క్షమించదని పేర్కొంది. భాజపా తన లబ్ది కోసం శిందేను వినియోగించుకుంటూనే ఉంటుందని పేర్కొంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తీసుకొంటున్న నిర్ణయాలనే సీఎం ఏక్‌నాథ్‌ శిందే ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని