BJP: 5 కోట్ల పోస్టుకార్డులు.. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు భాజపా సన్నద్ధమవుతోంది. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా ఆయన 20 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనంగా ‘సేవా, సమర్ఫణ్‌ అభియాన్‌’ పేరిట ప్రధాని పుట్టిన రోజు...

Updated : 05 Sep 2021 01:16 IST

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల నిర్వహణకు భాజపా ఏర్పాట్లు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు భాజపా సన్నద్ధమవుతోంది. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా ఆయన 20 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనంగా ‘సేవా, సమర్ఫణ్‌ అభియాన్‌’ పేరిట ప్రధాని పుట్టిన రోజైన సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 7 వరకు 20 రోజులపాటు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని సేవలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ బూత్‌ల నుంచి ఆయనకు అయిదు కోట్ల పోస్టుకార్డులు పంపనున్నట్లు తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు సూచించారు. వాటి పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా, పురంధేశ్వరి, వినోద్ సోన్‌కర్‌, రాష్ట్రీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్‌కుమార్ చాహర్‌కు అప్పగించారు.

కార్యక్రమాల వివరాలు..

* మోదీ జీవిత చరిత్రపై ప్రత్యేక ఎగ్జిబిషన్‌లు, నమో యాప్‌లో వర్చువల్‌ సమావేశాలు.. మేధావులు, ప్రముఖులకు ఆహ్వానం

* ఉత్తర్‌ప్రదేశ్‌లో 71 చోట్ల గంగా నది ప్రక్షాళన కార్యక్రమాలు

* ఆరోగ్య, రక్తదాన శిబిరాల నిర్వహణ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నిత్యవసరాల పంపిణీ

* అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఖాదీ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే సందేశం

* కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లల గుర్తింపు. పీఎం-కేర్స్‌ నిధులతో ఆదుకునేలా చర్యలు

* నరేంద్ర మోదీ అందుకున్న బహుమతుల వేలంపాట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని