
Punjab Politics: ‘కెప్టెన్’ని మార్చాలని 78మంది ఎమ్మెల్యేలు కోరారు: సూర్జేవాలా
దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక అంశాన్ని వెల్లడించింది. పంజాబ్‌లో తమ పార్టీకి మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 78మంది అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ మేరకు హైకమాండ్‌కు ఎమ్మెల్యేలు లేఖలు రాసినట్టు చెప్పారు. 78మంది ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన ఏ ముఖ్యమంత్రి అయినా తనకు తానుగా పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుందని అని సూర్జేవాలా పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తరచూ తలెత్తుతున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్‌లో గత నెలలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తనను తీవ్రంగా అవమానాలకు గురిచేస్తోందని పేర్కొంటూ ‘కెప్టెన్’ తన సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత అనూహ్యంగా సిద్ధూ కూడా పీసీసీ చీఫ్ పదవి నుంచి వైదొలగడం.. అమరీందర్ సింగ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకే గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకుంటానని ప్రకటించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పదవి ఉన్నా, లేకపోయినా వారిద్దరితోనే ఉంటా.. సిద్ధూ ట్వీట్
పదవి ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వెంటే తాను ఉంటానని పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. శనివారం మహాత్మా గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ఆ ఇద్దరు మహా నేతల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని ట్వీట్ చేశారు. తనను ఓడించేందుకు ప్రతికూల శక్తులన్నీ కలిసి ప్రయత్నించినా .. ఒక రవ్వంత పాజిటివ్ ఎనర్జీ పంజాబ్‌ను, ప్రతి పంజాబీనీ గెలిపిస్తుందంటూ ట్విటర్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.