‘కేజ్రీవాల్‌ కదలికలపై ఇంకా ఆంక్షలే’

రైతులకు మద్దతు తెలిపినందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను నిన్న గృహనిర్బంధం చేసిన కేంద్రం.. ఇప్పటికీ ఆయన కదలికలపై ఆంక్షలు కొనసాగిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ఆరోపించింది

Published : 09 Dec 2020 14:53 IST

ఆరోపించిన ఆప్‌.. తోసిపుచ్చిన దిల్లీ పోలీసులు

దిల్లీ: రైతులకు మద్దతు తెలిపినందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను నిన్న గృహనిర్బంధం చేసిన కేంద్రం.. ఇప్పటికీ ఆయన కదలికలపై ఆంక్షలు కొనసాగిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ఆరోపించింది. సీఎం నివాసం ప్రధాన ద్వారం ఇంకా మూసివేసే ఉందని పేర్కొంది. అయితే ఆమ్‌ ఆద్మీ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌ 11 గంటలకే తన ఇంటి నుంచి బయటకు వెళ్లారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

రైతుల బంద్‌కు మద్దతు తెలిపిన కేజ్రీవాల్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారంటూ ఆప్‌ శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగాయి. సింఘ సరిహద్దుల్లో సోమవారం రైతులను కలిసిన కేజ్రీవాల్‌ వారి ఆందోళనకు మద్దతు తెలిపినందుకే.. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో పోలీసులు ఇలా చేశారని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌ నివాసం ముందు నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

అయితే బుధవారం కూడా కేజ్రీవాల్‌ కదలికలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆప్‌ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా నేడు మీడియాతో మాట్లాడారు. ‘హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే సీఎం కదలికలను నియంత్రిస్తున్నారు ఇప్పటికీ ముఖ్యమంత్రి నివాసం ప్రధాన గేట్‌ను మూసివేసే ఉంచారు. ఇదంతా చూస్తుంటే అప్రకటిత అత్యవసర స్థితిలా కన్పిస్తోంది. ఆందోళన చేస్తున్న రైతుల కోసం స్టేడియంలను బహిరంగ జైళ్లుగా మార్చేందుకు ఆప్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకే కేంద్రం కక్షగట్టి ఇలా చేస్తోంది’ అని రాఘవ్‌ చద్దా ఆరోపించారు. 

అయితే ఆమ్‌ ఆద్మీ ఆరోపణలను సీనియర్‌ పోలీసు అధికారులు ఖండించారు. సీఎం కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేవని, భద్రతా ప్రొటోకాల్‌లో భాగంగానే ముఖ్యమంత్రి నివాసం ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా.. ఓ కార్యక్రమం నిమిత్తం ఈ ఉదయం 11 గంటలకే సీఎం తన నివాసం నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి..

రైతుల ఆందోళనలో క్రికెటర్‌

సవరణలకు ఒప్పుకోబోం: రైతు సంఘాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని