బిహార్‌ బూస్ట్‌.. యూపీ, బెంగాల్‌లోనూ మజ్లిస్‌ పోటీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఐదు స్థానాల్లో గెలుపొందిన ఏఐఎంఐఎం మరిన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ........

Updated : 12 Nov 2020 04:10 IST

హైదరాబాద్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఐదు స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం మరిన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్‌, 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. బిహార్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఒంటరిగా పోటీ చేస్తారా? కూటమిగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు.. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

బిహార్‌ ఎన్నికల్లో భాజపా వ్యతిరేక ఓటును చీల్చేందుకే మజ్లిస్‌ పోటీ చేసిందన్న ఆరోపణలను ఒవైసీ తోసిపుచ్చారు. తాను రాజకీయ పార్టీని నడుపుతున్నానని, దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం తనకు ఉందని తెలిపారు. అయినా పోటీ చేసే విషయంలో తాను ఎవరి అనుమతినైనా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. బిహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం ఓట్లను చీల్చిందని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ముస్లింల కోసం ఆయన సొంత నియోజకవర్గంలో ఏం చేశారని అధిర్‌ను ఎదురు ప్రశ్నించారు. బిహార్‌ ఎన్నికల్లో గ్రాండ్‌ డెమొక్రటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌లో భాగంగా 20 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయగా.. ఐదు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయావకాశాలను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని