
Published : 24 Oct 2020 02:08 IST
ప్రస్తుతం ‘స్థానిక’ యోచన లేదు: గౌతమ్‌రెడ్డి
అమరావతి: ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. దసరా తర్వాత కరోనా తీవ్రత పెరిగే వీలుందని.. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తప్పకుండా జరపాల్సినవి కనుకే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక ఎన్నికలను పోల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఈ మేరకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ గురువారం రాత్రి ఎన్నికల సంఘ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. 28న ఉదయం 9.30 నుంచి విజయవాడలోని ఎన్నికల సంఘ కార్యాలయంలో సమావేశం జరగనుంది.
Tags :