సిబల్‌జీ.. వేరే పార్టీ చూసుకోండి

ఇక దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ గుర్రుగా ఉంది.

Updated : 18 Nov 2020 15:18 IST

సీనియర్ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో వ్యతిరేకత

బిహార్ ఎన్నికలప్పుడు ఎక్కడున్నారని విమర్శలు

దిల్లీ: ఇక దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ గుర్రుగా ఉంది. సహచర నేతలు ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికరమైన కార్యకలాపాలకు పాల్పడే బదులు వేరే పార్టీని చూసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కొత్త పార్టీ పెట్టుకోవాలని విమర్శిస్తున్నారు.

‘కొంతమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ తమకు సరైంది కాదని భావిస్తే వారు తమ ఆసక్తి ప్రకారం వేరే పార్టీ పెట్టుకోవచ్చు లేక గొప్పదని భావించే వేరే పార్టీలోనూ చేరొచ్చు. అంతేగానీ కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసే ఇబ్బందికర కార్యకలాపాలకు పాల్పడొద్దు. ఆ నాయకులకు గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. వారు పార్టీ నాయకత్వం ముందు గానీ, సరైన పార్టీ సమావేశంలో గానీ సమస్యలను లేవనెత్తొచ్చు. కాంగ్రెస్ పార్టీని గొప్పగా తీర్చిదిద్దాలని అంత పట్టుదల ఉన్నప్పుడు, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. ఇటీవల జరిగిన బిహార్‌ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వచ్చారా?’ అంటూ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరీ మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకున్న ఘోర పరాభవం నేపథ్యంలో ఇటీవల కపిల్ సిబల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదని, పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలున్నాయని తెలిసినా, ఎవరూ పరిష్కారం కోసం ముందుకు రావడం లేదని, ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని