అలాగైతే పంజాబ్‌ అగ్నిగుండమే:అమరీందర్‌

సట్లేజ్‌ - యమునా లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండంలా మండుతుందని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్‌ అమ్రీందర్‌ సింగ్‌ హెచ్చరించారు.  హరియాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా.........

Published : 19 Aug 2020 01:41 IST

దిల్లీ: సట్లేజ్‌ - యమునా లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండంలా మండుతుందని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్‌ అమరీందర్‌‌ సింగ్‌ హెచ్చరించారు. హరియాణాతో నీటి పంపకంపై ఒత్తిడి తెస్తే ఇదో జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కెనాల్‌ నిర్మిస్తే ప్రజల్లో భావావేశాలు ప్రబలి జాతీయ భద్రతకు ఆటంకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ఈ సమావేశం అనంతరం హరియాణా సీఎం ఖట్టర్‌ మాట్లాడుతూ.. మరోసారి అమరీందర్‌‌ సింగ్‌తో ఈ సమస్యపై సమావేశం కానున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానన్నారు. లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తికావాలన్న వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పిందని తెలిపారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చండీగఢ్‌లో సమావేశమై చర్చలు జరుపుతారని, అయితే దీనికి తేదీని త్వరలోనే నిర్ణయించనున్నట్టు చెప్పారు. 

1966లో పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య జలాల పంపకంపై నెలకొన్న వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. హరియాణా తమకు ఎక్కువ వాటా కావాలని అడుగుతుండగా.. అందుకు పంజాబ్‌ ససేమిరా అంటోంది. తమకు ఎలాంటి మిగులు జలాలు లేవని చెబుతోంది. ఈ క్రమంలోనే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తీసుకొచ్చి జలాలను ఇరు రాష్ట్రాల మధ్య విభజించి, పంచుకొనేందుకు వీలుగా కెనాల్‌ ఏర్పాటుకు నాందిపలికింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ కెనాల్‌ నిర్మాణం చేపట్టగా.. దీనిపై శిరోమణీ అకాళీ దళ్‌ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాల చెలరేగింది.

ఇలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాలకు మధ్యవర్తిత్వం వహించాలని జులై 28న సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి ఇరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. హరియాణా, రాజస్థాన్‌లతో నీటి పంపకం విషయంలో పంజాబ్‌ విముఖత ప్రదర్శించింది. ఈ సందర్భంగా అమరీందర్‌‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తి చేయాలని మీరు నిర్ణయిస్తే పంజాబ్‌ అగ్నిగుండమవుతుంది. ఇదో జాతీయ సమస్యగా మారుతుంది. ఈ ప్రభావంతో హరియాణా, రాజస్థాన్‌ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు’’ అని కేంద్రాన్ని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని