బెంగాల్‌ మార్పును కోరుకుంటోంది..! అమిత్‌ షా

పశ్చిమ బెంగాల్‌ మార్పును కోరుకుంటోదనడానికి ర్యాలీలో పాల్గొన్న భారీ జనసంద్రమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Published : 21 Dec 2020 01:25 IST

కోల్‌కతా: రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన బోల్‌పూర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భాజపా మద్దతుదారులు హాజరయ్యారు. దీనిపై స్పందించిన అమిత్‌షా.. పశ్చిమ బెంగాల్‌ మార్పును కోరుకుంటోదనడానికి ర్యాలీలో పాల్గొన్న భారీ జనసంద్రమే నిదర్శనమన్నారు. రోడ్‌షోలో ఇంతటి జనాన్ని నా జీవితంలో ఎన్నడూ చూడలేదని అమిత్‌ షా అన్నారు.

‘నా జీవితంలో ఎన్నో రోడ్‌షోలను చూశాను..పాల్గొన్నాను కానీ, ఇంతటి భారీ జనసంద్రం కలిగిన రోడ్‌షోను తొలిసారిగా చూస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం, నమ్మకానికి ఇది నిదర్శనం. అంతేకాకుండా దీదీపై బెంగాల్‌ ప్రజలకు  ఉన్న ఆగ్రహాన్ని ఇది స్పష్టం చేస్తోంది’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, రెండోరోజు పర్యటనలో భాగంగా అమిత్‌ షా ఈ ఉదయం శాంతినికేతన్‌ను సందర్శించారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కొద్దిసేపు వీక్షించారు. తర్వాత జానపద గాయకుడి ఇంటిలో మధ్యాహ్న భోజనం చేశారు. అమిత్‌ షా పర్యటనలో భాగంగా ఆయనతో పాటు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, ఇతర పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..
దీదీ..ఇది ఆరంభం మాత్రమే
మిషన్‌ బెంగాల్‌: అమిత్‌ షా బిజీబిజీ

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని