దీదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎంఐఎం చీఫ్‌!

పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీలను చీల్చడానికి ఎంఐఎం పార్టీని తీసుకొచ్చేందుకు భాజపా రూ.కోట్లు ఖర్చుచేస్తోందని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 17 Dec 2020 04:11 IST

మైనారిటీలు మీ జాగీర్‌ కాదని వ్యాఖ్య

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీలను చీల్చడానికి ఎంఐఎం పార్టీని తీసుకొచ్చేందుకు భాజపా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను డబ్బుతో కొనేవారు ఇప్పటివరకు ఎవ్వరూ పుట్టలేదని ట్విటర్‌లో బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘మైనారిటీ ఓటర్లు మీ జాగీర్‌ కాదని’ మమతా బెనర్జీకి చురకలంటించారు. మైనారిటీల శ్రేయస్సుకోసం ఆలోచించి, మాట్లాడే వారిని మీరు ఇష్టపడరని బెంగాల్‌ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. బిహార్‌లో మైనారిటీలను కూడా మీరు అవమాన పరిచారని.. తమ వైఫల్యాలను ఇతరులపై మోపినవారికి బిహార్‌లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలని దీదీకి సూచించారు.

అంతకుముందు, మైనారిటీ ఇట్లను చీల్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ పార్టీకి డబ్బులు ఇస్తోందని మమతా బెనర్జీ భాజపాపై ఆరోపణలు చేశారు. ఓటర్ల మధ్య మతపరమైన విభజన తీసుకొచ్చేందుకు అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ పార్టీని రాష్ట్రానికి దిగుమతి చేయబోతోందని, ఇందుకు కోసం కోట్ల రూపాయలను భాజపా వెచ్చిస్తోందని మమతా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ.. మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపడేశారు. తృణమూల్‌కు చెందినవారు ఎంతోమంది భాజపాలో చేరుతున్నారని.. మమతా బెనర్జీ వాటిపైన దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు పలికారు.

ఇదిలాఉంటే, ఇటీవలి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ సరిహద్దుకు సమీపంలోని సీమాంచల్‌ ప్రాంతంలో అయిదు స్థానాలను గెలుచుకుంది. రానున్న పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జల్పాయిగురిలో నిర్వహించిన సభలో మమతా బెనర్జీ భాజపా, ఎంఐఎం పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవీ చదవండి..
మజ్లిస్‌పై రూ.కోట్లు వెచ్చిస్తున్న భాజపా: మమత
చుక్కలు కలిసిన ఆ రాత్రి..!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని