‘మాన్సాస్‌ ట్రస్ట్‌ ప్రైవేటు ఆస్తి కాదు’

రాజకీయాలకు అతీతంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలు ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Updated : 01 Oct 2020 20:34 IST

తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు

విజయనగరం: రాజకీయాలకు అతీతంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలు ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌.. కుటుంబ, ప్రైవేట్‌ ఆస్తి కాదన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు అనేక చోట్ల భూములున్నాయని.. రూ.125 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని అశోక్‌ గజపతిరాజు తెలిపారు. అయినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం దారుణమని విమర్శించారు. ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు. 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజును ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో అశోక్‌ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతి రెండో కుమార్తె సంచయిత గజపతి రాజును ఛైర్‌పర్సన్‌గా నియమించింది. అనూహ్య రీతిలో సంచయితకు మాన్సాస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. మాన్సాస్‌ ట్రస్ట్‌ కింద 108 ఆలయాలు, వివిధ విద్యాసంస్థలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని