ఆరేళ్ల పాలనలో ఏం చేశారు?: విజయశాంతి

సీఎంగా కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారని భాజపా నేత విజయశాంతి ప్రశ్నించారు. ఆయన పతనం ప్రారంభమైందని.. ..

Updated : 11 Dec 2020 06:04 IST

హైదరాబాద్‌: సీఎంగా కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారని భాజపా నేత విజయశాంతి ప్రశ్నించారు. ఆయన పతనం ప్రారంభమైందని.. త్వరలోనే తెరాస కనుమరుగుకానుందని ఆమె జోస్యం చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. తెలంగాణకోసం తాము ఉద్యమం చేస్తున్నప్పుడు కేసీఆర్‌ తెదేపాలో ఉన్నారన్నారు.  తన దూకుడు చూసి ఆలె నరేంద్రను రాయబారానికి పంపారని.. తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేయాలంటూ కేసీఆర్‌ తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌ తనకంటే గొప్ప నటుడని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను రాజకీయాలకు దూరం చేయాలనే కుట్ర పన్నారన్నారు. తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించగానే అర్ధరాత్రి తనను తెరాస నుంచి సస్పెండ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. తెరాసను ఇన్నాళ్లు ప్రజలు భరించారని.. ఇక భరించే ఓపిక వారికి లేదన్నారు. జీవితాంతం తన కుటుంబమే పరిపాలించాలనే విధంగా కేసీఆర్‌ గేమ్‌ ప్లే చేశారని విజయశాంతి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో పదవుల కొట్లాట జరుగుతోందని.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఏర్పాటు చేయాలి: లక్ష్మణ్‌

అనంతరం భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌లో ప్రత్యేక పాలన కొనసాగిస్తారనే వార్తలు వస్తున్నాయని.. కేసీఆర్‌, కేటీఆర్‌ కుట్రలు చేస్తే భాగ్యనగర ప్రజలు క్షమించరన్నారు. ఉద్యమ సమయంలో విజయశాంతి రాజీలేని పోరాటాలు చేశారని.. ఆమె తిరిగి సొంతగూటికి రావడం సంతోషమన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని లక్ష్మణ్‌ చెప్పారు.

ఇవీ చదవండి..

పదోన్నతి కావాలి..అందుకే రాజీనామా: అంజన్‌

‘ఆ తరహా చట్టాలు తెలంగాణలోనూ రావాలి’ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని