ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి?:అర్వింద్‌

గత గ్రేటర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారో తెరాస చెప్పాలని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. ఒక కుటుంబానికి నెలకు

Published : 24 Nov 2020 16:24 IST

హైదరాబాద్‌: గత గ్రేటర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారో తెరాస చెప్పాలని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. ఒక కుటుంబానికి నెలకు రూ.2వేల పింఛను ఇస్తూ.. కేసీఆర్‌ కుటుంబం రూ.15లక్షలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్వింద్‌ మాట్లాడారు. 24 గంటలపాటు విద్యుత్‌ అందిస్తున్నామని తెరాస ప్రభుత్వం గొప్పలు చెబుతోందని.. దేశంలో ఏ రాష్ట్రం విద్యుత్‌ ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కరోనా పేరుతో మూడింతల విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కాదా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లోనూ హామీ ఇచ్చి విస్మరించారని.. ఇప్పుడు మళ్లీ ప్రకటించడమేంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని.. ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ పారిశుద్ధ్య కార్మికులు గుర్తురావడమేంటన్నారు. భాజపా, ఇతర పార్టీలకు ఒక్క హోర్డింగ్‌ కూడా ఇవ్వొద్దంటూ యాడ్‌ ఏజెన్సీలకు మంత్రి కేటీఆర్‌ హుకుం జారీ చేయడమేంటని అర్వింద్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని