19 లక్షల ఉద్యోగాలు.. ఉచిత వ్యాక్సిన్‌: నిర్మల

బిహార్‌ ఎన్నికలు రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అధికార, ప్రతిపక్షాలు ప్రజలను అకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఆర్జేడీ ప్రకటించిన నేపథ్యంలో.. దానికి దీటుగా భాజపా మరిన్ని హమీలను గుప్పించింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా...

Published : 22 Oct 2020 12:27 IST

పట్నా: బిహార్‌ ఎన్నికలు రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అధికార, ప్రతిపక్షాలు ప్రజలను అకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఆర్జేడీ ప్రకటించిన నేపథ్యంలో.. దానికి దీటుగా భాజపా మరిన్ని హమీలను గుప్పించింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌ని రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భాజపా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత 15 ఏళ్లలో బిహార్‌లో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందన్నారు. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మోసపూరితమైన హామీలను నమ్మకుండా ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఐదేళ్లపాటు నితీశ్‌కుమార్‌ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా ఇతర హామీలు
* రాష్ట్రంలో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
* బిహార్‌ను ఐటీ హబ్‌గా తయారు చేసి 10 లక్షల మందికి ఉపాధి కల్పన
* 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి
* ఆరోగ్య రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు
* 30 లక్షల కుటుంబాలకు పక్కా గృహాల మంజూరు
* 9 తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబ్లెట్‌

ఇటీవల ఆర్జేడీ ప్రకటించిన మేనిఫెస్టోలో 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనడాన్ని జేడీయూ తప్పుబట్టిన విషయం తెలిసిందే. అది సాధ్యపడే అవకాశమే లేదని చెప్పింది. ఈ అంశంపై తేజస్వి యాదవ్‌, ముఖ్యమంత్రి నితీశ్‌ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అనుభవమున్నప్పటికీ ఇంకా పాత తరహాలోనే సీఎం వ్యవహరిస్తున్నారని తేజస్వి విమర్శించగా.. అనుభవలేమితో నోటికొచ్చినట్లు హామీలిస్తున్నారని నితీశ్‌ దుయ్యబట్టారు. అయితే, తాజాగా జేడీయూ మిత్ర పక్షం భాజాపా హామీతో తిరిగి విమర్శలు మొదలయ్యే అవకాశముందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని 243 శాసనసభ స్థానాలకు అక్టోబరు 28 నుంచి 3 విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని