రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భాజపాదే

2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా విజయాన్ని ముఖ్యమంత్రి

Updated : 24 Sep 2022 14:32 IST

ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమైన భాజపా నేతలు

హైదరాబాద్‌: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గానీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీగానీ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ప్రజలు అసదుద్దీన్‌ ఒవైసీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. మొత్తం 48 డివిజనల్లో భాజపాను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూహైదరాబాద్‌ ప్రజల ఆశీస్సులు కొనసాగాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో భాజపా కీలక నేతలు భేటీ అయ్యారు. వారికి అభినందనలు తెలుపుతూ భవిష్యత్‌ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు.

సమయమిస్తే 100 గెలిచేవాళ్లం: బండి సంజయ్‌
అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించారని, సమయం ఇచ్చినట్లయితే 100 స్థానాలకు పైగా విజయం సాధించేవాళ్లమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు తెరాస అన్ని ప్రయత్నాలూ చేసిందని విమర్శించారు. భాజపాకు ప్రజలు అండగా ఉండి 48 స్థానాల్లో గెలిపించడం ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడారన్నారు. భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు తక్కువ సమయం ఇచ్చినా కార్యకర్తలు బాగా పని చేశారన్నారు. ఎన్నికల కమిషన్‌ తెరాస చెప్పుచేతల్లో నడిచిందని ఎద్దేవా చేశారు.

భవిష్యత్‌లో ఏ ఎన్నికలు జరిగినా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని సంజయ్‌ వివరించారు. భాజపా కేంద్ర నాయకుల రాకతో తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. ‘‘ గ్రేటర్‌ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం బాగా ఉపయోగపడింది. ఈ‌ ఎన్నికల్లో భాజపా ఓటు శాతం గణనీయంగా పెరిగింది. తక్కువ సమయంలోనే విజయం కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేశాం. తెరాసపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో.. భాజపాపై ఎంత విశ్వాసం ఉందో ఓట్ల శాతాలే చెబుతున్నాయి. చాలా స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. త్వరలోనే గెలిచిన అభ్యర్థులతో చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటాం’’ అని బండి సంజయ్‌ అన్నారు.

పార్టీలోకి విజయశాంతి

ఎన్నికల వరకే రాజకీయాలని.. ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యమని బండి సంజయ్‌ తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ తీరు మార్చుకోకపోతే ప్రజాఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భాజపా కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించొద్దని హెచ్చరించారు. ఎంఐఎం కేవలం పాతబస్తీకే పరిమితమైన పార్టీ అన్నారు. విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరబోతున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి భాజపాలో చేరుతున్నారంటున్న వార్తలపైనా ఆయన స్పందించారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తండ్రి చేరతారా?కొడుకు చేరతారా? అన్నది కాదని, ఇద్దరూ ఒక్కటేనని సంజయ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని