ఏపీఎంసీలు కొనసాగాలనే నేను చెప్పా: పవార్‌

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏపీఎంసీ చట్ట సవరణలపై తాను రాష్ట్రాలకు రాసిన లేఖ విషయమై భాజపా వివాదాన్ని సృష్టిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మండిపడ్డారు. దాంతో కేంద్రం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Updated : 09 Dec 2020 02:27 IST

దిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏపీఎంసీ చట్ట సవరణలపై తాను రాష్ట్రాలకు రాసిన లేఖ విషయమై భాజపా వివాదాన్ని సృష్టిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మండిపడ్డారు. దాంతో కేంద్రం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ కమిటీల్లో(ఏపీఎంసీ) కొన్ని సంస్కరణలు అవసరమని నేను అప్పట్లో చెప్పాను. సంస్కరణలైతే చేపట్టాలి.. కానీ ఏపీఎంసీ చట్టం మాత్రం కొనసాగాల్సిందే అని చెప్పాను. రాష్ట్రాలకు రాసిన లేఖల్లోనూ అదే విషయాన్ని ప్రస్తావించాను. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల్లో ఎక్కడా ఏపీఎంసీల గురించి ప్రస్తావించలేదు. వారు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు’ అని పవార్‌ అన్నారు. 

అంతేకాకుండా.. ‘వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలతో బుధవారం సమావేశమై వ్యవసాయ చట్టాల విషయంలో ఒక నిర్ణయానికి రావాలనుకున్నాం. రేపు సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాం. సమావేశంలో మేం తీసుకోబోయే ఏకాభిప్రాయాన్ని రాష్ట్రపతి ముందు ఉంచుతాం’ అని పవార్‌ చెప్పారు. 

కాగా కేంద్ర వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం ఆరోపించిన విషయం తెలిసిందే. యూపీఏ హయాంలో శరద్‌పవార్‌ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ మార్కెట్‌లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని పేర్కొంటూ.. మరి పవార్‌ ఇప్పుడు ఎందుకు ఆ చట్టాల్ని వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూడా 2019ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీఎంసీ చట్టం రద్దు గురించి ప్రస్తావించిన అంశాన్ని రవిశంకర్‌ చదివి వినిపించారు. ఇలా ప్రతిపక్ష పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబించడం తగదంటూ మండిపడ్డారు. కాగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపుకు మద్దతు తెలిపిన పార్టీల్లో ఎన్సీపీ కూడా ఉంది. 

ఇవీ చదవండి...

ఆ చట్టాలపై ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి: రవిశంకర్‌ ప్రసాద్‌

భారత్‌ బంద్‌ ప్రశాంతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని