పోలీసుల అదుపులో ఖుష్బూ

భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 27 Oct 2020 15:42 IST

చెన్నై: భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురాతన హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకటైన మనుస్మృతిపై ఓ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాజపా మహిళా విభాగం తమిళనాడు వ్యాప్తంగా నిరసనలను నిర్వహిస్తోంది. వాటికి నాయకత్వం వహించేందుకు వెళ్తోన్న ఆమెను చెంగల్‌పట్టు జిల్లాలోని కడలూర్‌ వద్ద అరెస్టు చేశారు. 

ఇటీవల విదుతలై చిరుతైగల్ కాట్చి(వీసీకే) అధినేత తోల్ తిరుమవలవన్‌ మాట్లాడుతూ..మనుస్మృతిని నిషేధించాలంటూ డిమాండ్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇవి మత ఘర్షణలకు దారితీస్తాయంటూ భాజపా ఆ వ్యాఖ్యలను ఖండించింది. రాష్ట్ర వ్యాప్త నిరసనలను చేపట్టాలని చూడగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. కాగా, ఈ విమర్శలపై తిరుమవలవన్‌ స్పందించారు. ‘నేను మనుస్మృతి అని మాత్రమే ప్రస్తావించాను. దాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాను. ఘర్షణలు లేవనెత్తడానికి భాజపా నకిలీ వార్తలను ప్రచారం చేస్తోంది’ అని భాజపా తీరుపై మండిపడ్డారు. అలాగే వీసీకే అధినేతపై కేసు నమోదు చేయడాన్ని డీఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీలు తప్పుపట్టాయి.

కాగా, తనను అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ ఖుష్బూ ట్వీట్‌ చేశారు. ‘మమ్మల్ని అరెస్టు చేసి పోలీసు వ్యాన్‌ ఎక్కించారు. మహిళల గౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడతాం. ప్రధాని నరేంద్ర మోదీజీ ఎల్లప్పుడూ మహిళల భద్రత గురించే మాట్లాడతారు. మేం ఆయన దారిలోనే నడుస్తాం. ఎటువంటి దురాగతాలకు తలవంచం. భారత్ మాతాకీ జై’ అంటూ తన నిరసనను తెలియజేశారు. ఇదిలా ఉండగా..కొద్ది రోజుల క్రితమే ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాజపా శిబిరంలోకి మారారు. ఈక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో ‘ఏ మాత్రం ప్రజాదరణ, క్షేత్ర స్థాయిపై అవగాహన లేకుండా పై స్థాయిలో ఉన్న కొంతమంది పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలనుకుంటున్న నాలాంటి వారిని అణచివేస్తున్నారు’ అని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని