By-elections: మమతపై పోటీకి అభ్యర్థిని నిలబెడతాం: అధిర్‌ రంజన్‌

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30న జరగబోయే ఉప ఎన్నికల్లో .....

Published : 07 Sep 2021 01:12 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30న జరగబోయే ఉప ఎన్నికలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌధురి సోమవారం రాత్రి ప్రకటించారు. దీదీపై పోటీకి అభ్యర్థిని పెట్టే అవకాశం లేదన్న భావనను ఇటీవల వ్యక్తం చేసిన ఆయన.. అధికార పార్టీ కనీసం రాజకీయ మర్యాదతో కూడా వ్యవహరించడంలేదని ఆరోపించారు. తమ పార్టీ తరఫున అభ్యర్థి పేరును ఏఐసీసీ ఆమోదం కోసం పంపనున్నట్టు చెప్పారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో అత్యధిక మంది నేతలు తృణమూల్‌పై పోటీ చేయాలని అడుగుతున్నారు. అందుకే భవానీపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించాం. వామపక్ష కూటమితో కలిసి పోటీ చేస్తాం. ఆ పార్టీలతో చర్చించాక అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని అధిర్‌ రంజన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడిందని మండిపడ్డారు.

మరోవైపు, దీదీపై పోటీకి కాంగ్రెస్‌ దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆధిర్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన దీదీ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో సమావేశమై భాజపాను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసిన విషయం తెలిసిందే. 

ఆ పార్టీలు పెద్ద సున్నాలే..: తృణమూల్‌

భవానీపూర్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయాలన్న నిర్ణయానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ..  కాంగ్రెస్‌, వామపక్షాలు రెండూ పెద్ద సున్నాలని, వారి ప్రభావం ఏమీ ఉండబోదన్నారు. రెండు సున్నాలను కలిపితే సున్నాయే వస్తుందని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు