
‘నా అభిప్రాయాన్ని జగన్‌తో ముడిపెట్టడమా?’
సునీల్ దేవ్‌ధర్ ట్వీట్‌పై స్పందించిన భూమన
తిరుపతి: విరసం నేత వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని చెప్పారు. 81 ఏళ్ల వరవరరావుపై జాలి చూపమనే కోరానని స్పష్టం చేశారు. వరవరరావు విడుదలపై జోక్యం చేసుకోవాలంటూ ఉపరాష్ట్రపతికి భూమన ఇటీవల లేఖ రాశారు. దీన్ని సునీల్ దేవ్‌ధర్ తప్పుబట్టారు. ట్విటర్ ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భూమన స్పందిస్తూ ఉపరాష్ట్రపతికి లేఖ రాయడానికి గల కారణాలపై వివరణ ఇచ్చారు. తన రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని.. వెంకయ్యనాయుడు, వరవరరావుతో కలిసి జైల్లో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. అందుకే వరవరరావు విషయంపై వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెట్టడం బాధించిందని సునీల్ దేవ్‌ధర్‌ను ఉద్దేశించి భూమన వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే..
నిర్బంధంలో ఉన్న వరవరరావును విడుదలపై జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉపరాష్ట్రపతికి లేఖ రాశారు. 81 సంవత్సరాల వయసు, అనారోగ్యంతో ఉన్న వరవరరావును విడుదల చేసేందుకు ప్రభుత్వం దయ చూపాలంటూ విజ్ఞప్తి చేశారు. దీన్ని భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ తప్పుబడుతూ ట్విటర్ ద్వారా సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘‘జగన్ రెడ్డి గారూ దేశ ప్రధాన మంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరిన భూమన కరుణాకర్‌రెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్లిందనుకోవాలా? తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. సునీల్ దేవ్‌ధర్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా భూమన స్పందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.