విజయ‘తేజం’ ఎవరిదో!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోదశ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రెండు నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవే రాఘోపుర్, హసన్‌పుర్‌లు. రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత,

Updated : 01 Nov 2020 16:34 IST

అందరి దృష్టీ రాఘోపుర్, హసన్‌పుర్‌లపైనే..

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోదశ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రెండు నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవే రాఘోపుర్, హసన్‌పుర్‌లు. రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ తనయులు తేజస్వి.. తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లు పోటీ చేస్తున్న ఈ రెండు స్థానాల్లో పోరు కూడా హోరాహోరీగా సాగుతోంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబరు 3న 17 జిల్లాల పరిధిలోని 94 స్థానాలకు రెండోదశ పోలింగ్‌ జరగనుంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరగనున్న రాఘోపుర్, హసన్‌పుర్‌లలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగొలుపుతున్నాయి.

లాలూప్రసాద్‌కు రాఘోపుర్‌ స్థానం కంచుకోటగా చెబుతారు. ఆయన రెండో కుమారుడు, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ మరోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. గత (2015) ఎన్నికల్లోనూ తేజస్వి ఇక్కడి నుంచే పోటీచేసి భాజపా నేత సతీశ్‌ కుమార్‌ను ఓడించగా.. ఇప్పుడు మరోసారి ఆయనతోనే తలపడుతున్నారు. లాలూప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి కూడా 1995-2010 మధ్య ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2010లో మాత్రం రబ్రీదేవి అప్పటికి జేడీయూలో ఉన్న సతీశ్‌ కుమార్‌ చేతిలోనే ఓడిపోయారు. సతీశ్‌కు తర్వాత జేడీయూ టిక్కెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో తర్వాత ఆయన భాజపాలో చేరిపోయారు. 

హోరాహోరీయే..
వైశాలి జిల్లాలో ఉన్న రాఘోపుర్‌లో యాదవ్‌ సామాజికవర్గానికి గట్టి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి గెలిచినప్పటికీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అప్పట్లో మహా కూటమిలో నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ కూడా ఉండటంతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల మద్దతుతో తేజస్వి పోటీచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో జేడీయూ ఎన్‌డీయే కూటమిలో ఉండటంతో ఇప్పుడు ఆ పార్టీ మద్దతు భాజపా అభ్యర్థికే ఉంది. పైగా ఇద్దరు అభ్యర్థులూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో గట్టిపోటీ నెలకొంది.

మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్న రాఘోపుర్‌లో భాజపా అభ్యర్థి సతీశ్‌ ప్రతిరోజూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తేజస్వి మాత్రం తన తండ్రి జైలులో ఉండటంతో రాష్ట్రం మొత్తం మీద ఆర్జేడీ ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తూ నియోజకవర్గంలో ప్రచారానికి పూర్తిస్థాయిలో సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. 
► లాలూప్రసాద్‌ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ హసన్‌పుర్‌లో ప్రధాన అభ్యర్థి. గత ఎన్నికల్లో మహువా స్థానం నుంచి విజయం సాధించిన ఆయన ఈసారి హసన్‌పుర్‌కు మారారు. మెజార్టీ సంఖ్యలో యాదవ్‌లు, ముస్లింలు ఉన్న నియోజకవర్గం ఇది. వివిధ కారణాలతో తన గెలుపు ఇక్కడ సులువున్న భావనతోనే ఆయన ఇటు మారినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన గెలుపు సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గట్టి పోటీయే..
2015లో హసన్‌పుర్‌లో విజయం సాధించిన జేడీయూ అభ్యర్థి రాజ్‌కుమార్‌ రాయ్‌తో ఈసారి తేజ్‌ప్రతాప్‌ తలపడుతున్నారు. అప్పట్లో రాజ్‌కుమార్‌ బీఎల్‌ఎస్‌పీ అభ్యర్థిని ఓడించారు. 2010 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌కుమార్‌ కూడా యాదవ్‌ సామాజికవర్గానికి చెందినవారే. అలాగే జన్‌ అధికార్‌ పార్టీ (జేఏపీ) అధినేత, మాజీ ఎంపీ పప్పు యాదవ్‌ కూడా ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో యాదవ్‌ సామాజికవర్గ ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి.

గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన తేజ్‌ప్రతాప్‌ తన తమ్ముడు తేజస్వియాదవ్‌ అంతగా రాజకీయాల్లో ప్రాచుర్యం కాలేదు. 2018లో తాను వివాహం చేసుకున్న ఐశ్వర్యతో వేరుపడటం, వివాదపడటంతో ఆయన ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. వారి విడాకుల కేసు న్యాయస్థానంలో ఉంది. ఐశ్వర్య తండ్రి చంద్రికారాయ్‌కు గట్టిపట్టున్న పార్సా అసెంబ్లీ స్థానానికి దగ్గర్లోనే మహువా ఉంది. ఆయన ప్రభావం పడుతుందన్న భావనతో కూడా తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మహువా నుంచి హసన్‌పుర్‌కు మారినట్లు చెబుతున్నారు.
హసన్‌పుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖగడియా లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎల్‌జేపీకి చెందిన చౌధరీ మెహబూబ్‌ అలీ కైజర్‌ వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. అయితే హసన్‌పుర్‌లో ఎల్‌జేపీ అభ్యర్థి ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఇది తేజ్‌ప్రతాప్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు.
తేజస్వి ఆశలు..

తన తండ్రికి ప్రజల్లో ఉన్న ఆదరణతో పాటు, తాను విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అవుతానని చేస్తున్న ప్రచారం తనకు కలిసివస్తుందని తేజస్వి భావిస్తున్నారు. అలాగే నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ప్రధానంగా నిరుద్యోగం, వలసలు అంశంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుండగా.. 10 లక్షల ఉద్యోగాల హామీ తనను గట్టెక్కిస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నారు. 
► చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ కూడా ఇక్కడ తన అభ్యర్థిని నిలబెట్టింది. ఎల్‌జేపీ విజయం సాధించే పరిస్థితిలో లేనప్పటికీ ఆ పార్టీ భాజపా ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇది కూడా తేజస్వికి కలిసొచ్చే అవకాశంగా పలువురు భావిస్తున్నారు.

తేజ్‌ ప్రతాప్‌
తేజ్‌ ప్రతాప్‌ అక్టోబరు 13 నుంచి నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. తన తండ్రికి ఉన్న ప్రజాదరణ తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన యువకులతో క్రికెట్‌ ఆడటం, ట్రాక్టర్‌ నడపడం, ఫ్లూటు ఊదడం, స్థానిక ఆహారం తీసుకోవడం వంటివి చేస్తున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని