మహారాష్ట్రలో భాజపాకు చుక్కెదురు!

మహారాష్ట్రలో డిసెంబరు 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు చుక్కెదురైంది. మొత్తం మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా భాజపా కేవలం ఒకచోట మాత్రమే గెలుపొందింది.........

Published : 04 Dec 2020 15:16 IST

ముంబయి: మహారాష్ట్రలో డిసెంబరు 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు చుక్కెదురైంది. మొత్తం మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా భాజపా కేవలం ఒకచోట మాత్రమే గెలుపొందింది. మిగిలిన నాలుగు స్థానాల్లో శివసేన నేతృత్వంలోని అధికార ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమి విజయం దాదాపు ఖరారైంది. 

ఔరంగాబాద్‌ గ్రాడ్యుయేట్‌ డివిజన్‌లో ఎన్సీపీకి చెందిన సతీష్‌ చవాన్‌ గెలుపొందారు. పుణె గ్రాడ్యుయేట్‌ డివిజన్‌లోనూ ఎన్సీపీ నేత అరుణ్‌ లాడ్‌ విజయం సాధించారు. పుణెలో ఓటమి భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థానానికి భాజపా మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ప్రాతినిథ్యం వహించారు. ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి పాటిల్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, వారి వ్యూహాలు ఫలించలేదు. 

నాగ్‌పూర్‌ గ్రాడ్యుయేట్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ నేత అభిజిత్‌ వంజరీ, పుణె టీచర్స్‌ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ నాయకుడు జయంత్‌ అస్గావోంకర్‌ ఆధిక్యంలో ఉన్నారు. అమరావతి టీచర్స్‌ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి కిరణ్‌ సర్‌నాయక్‌ ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు వెలువడే సరికి వీరి విజయం దాదాపు ఖరారుకానుంది. 

ఈ ఫలితాలపై దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మా అంచనాల ప్రకారం రాలేదు. మేం మరికొన్ని సీట్లు ఆశించాం. కానీ, ఒకచోటే గెలుపొందాం. మహా వికాస్‌ ఆఘాడీ కూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం’’ అని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. తాజా ఫలితాలు మహా వికాస్‌ ఆఘాడీ కూటమి ఏడాది పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని