రేపే పోల్‌ డే: 11 రాష్ట్రాలు.. 148 స్థానాలు

కొవిడ్‌ సమయంలో రాజస్థాన్‌ ఎపిసోడ్‌ మినహా దేశంలో పెద్దగా రాజకీయ సందడి లేదనే చెప్పాలి. తాజాగా బిహార్‌ ఎన్నికలతో మళ్లీ దేశంలో రాజకీయ వేడి......

Updated : 02 Nov 2020 20:19 IST

బిహార్‌ అసెంబ్లీ సహా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలూ రేపే

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సమయంలో రాజస్థాన్‌ ఎపిసోడ్‌ మినహా దేశంలో పెద్దగా రాజకీయ సందడి లేదనే చెప్పాలి. తాజాగా బిహార్‌ ఎన్నికలతో మళ్లీ దేశంలో రాజకీయ వేడి మొదలైంది. ఆ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మంగళవారం (నవంబర్‌ 3న) రెండో దశలో భాగంగా 94 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు 10 రాష్ట్రాల పరిధిలో మరో 54 స్థానాలకు సైతం రేపే ఎన్నికలు జరగనున్నాయి. అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇదే తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఒక్కసారిగా నవంబర్‌ 3కు ఎక్కడాలేని ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈ తేదీ ‘పోల్‌ డే’గా మారిపోయింది.

తేలనున్న లాలూ తనయుల భవితవ్యం

బిహార్‌ అసెంబ్లీ గడువు దగ్గరపడడంతో 243 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. గత నెల 28న మొదటి విడత పోలింగ్‌ జరిగింది. రెండో విడతలో భాగంగా 94 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ భవితవ్యం రేపే ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. నితీశ్‌ ప్రభుత్వంలో ఉన్న మరో నలుగురు మంత్రుల భవితవ్యం కూడా రేపే తేలనుంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 2.85 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

10 రాష్ట్రాల్లో ఫైట్‌

దేశంలో మొత్తం 63 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 11 రాష్ట్రాల పరిధిలో 56 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్‌ వెలువరించింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించడం లేదు.  మిగిలిన స్థానాల్లో మణిపూర్‌లోని రెండు స్థానాలకు ఈ నెల 7న బిహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతో పాటు పోలింగ్‌ జరగనుంది. బిహార్‌ మూడో దశ పోలింగ్‌ కూడా అదే రోజు జరగనుంది. ఇక మిగిలిన 10 రాష్ట్రాల పరిధిలోని 54 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది.

ఇందులో మధ్యప్రదేశ్‌లో 28; గుజరాత్‌లో 8; యూపీలో 7, ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో 2; ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ (దుబ్బాక), హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌ పోరు ఆసక్తికరం. సింథియా సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మెజార్టీ సాధించాలంటే మరో 9 స్థానాలు గెలుపొందాలి. దీంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. తెలంగాణలోని దుబ్బాక ఎన్నికలు కూడా కీలకంగా మారాయి. మొత్తంగా బిహార్‌ సహా మిగిలిన రాష్ట్రాల్లో జరిగే అన్ని ఉప ఎన్నికల ఫలితాలూ నవంబర్‌ 10నే వెలువడనున్నాయి.

అమెరికా భవిష్యత్తూ రేపే
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సైతం రేపే జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తుండగా.. డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ సైతం ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఈసారి ఎక్కువమంది పోస్టల్‌ ఓట్ల వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఈసారి ఎన్నికల తుది ఫలితాలు మరింత ఆలస్యంగానే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని