భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం:భట్టి

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించుకుంటోందని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఆరోపించింది.

Published : 15 Sep 2020 01:03 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించుకుంటోందని తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఆరోపించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణాలను 90శాతం నుంచి 200 శాతానికి పెంచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని  మండిపడ్డారు. భవిషత్తులో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పడుతుందని.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. 

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం కాదని.. భూ సర్వే చేసిన తర్వాతే ధరణిలో నమోదు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వీఆర్వో, తహసీల్దార్లు బాగా పని చేస్తున్నారంటూ కేసీఆర్‌ బోనస్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 77 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో 54 వేల ఎకరాలు కబ్జాకు గురైందని సీఎం చెబుతున్నారని.. ఆరేళ్ల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా ఒంటెద్దు పోకడలను విడనాడాలని హితవు పలికారు. ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్టం చేసి అభివృద్ధి చేయాలని, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. 2014 నుంచి వీసీలను నియమించాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఐదు ప్రైవేటు యూనివర్సిటీల్లో మూడు తెరాస పార్టీకి చెందిన వ్యక్తులవేనని ఆయన దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని