విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్‌

రాజస్థాన్‌ రాజకీయాలు ఎట్టకేలకు ముగింపునకు చేరాయి. కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. రాజస్థాన్‌ అసెంబ్లీ....

Published : 16 Aug 2020 00:35 IST

జైపూర్‌: రాజస్థాన్‌లో గత కొన్ని రోజులు సాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు ముగింపు పడింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. రాజస్థాన్‌ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బు, అధికారం ఉపయోగించి మధ్యప్రదేశ్‌, మణిపూర్‌ ,గోవాలో ప్రభుత్వాలను  పడగొట్టిందన్న మంత్రి.. అదే మంత్రాన్ని రాజస్థాన్‌లో ప్రయోగించగా బెడిసికొట్టిందని విమర్శలు గుప్పించారు. గహ్లోత్‌ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ విజయం సాధించినట్టు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 21వరకు వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడనీయను: గహ్లోత్‌
భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టనీయబోనని సీఎం అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామన్నారు. భాజపా నేత వసుంధర రజేతో తాను చేతులు కలిపినట్టు వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆమెతో తానెలంటి సంభాషణా జరపలేదన్నారు.

విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా ఉంది: పైలట్‌
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గడం సంతోషంగా ఉందన్నారు.  దీంతో ఊహాగానాలకు స్వస్తిపలికినట్టయిందని తెలిపారు. రాజస్థాన్‌ ప్రజల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు.

అసలేం జరిగింది?

సీఎం గహ్లోత్‌-పైలట్‌ల మధ్య నెలకొన్న విభేదాలతో రాజస్థాన్‌ రాజకీయాలు అనేక మలుపులతో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. సొంత పార్టీపైనే సచిన్‌ పైలట్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేయడం అక్కడి కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు నడిచాయి. భాజపా కూడా ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలే చేసింది. అనంతరం అనేక కీలక పరిణామాల తర్వాత  కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు రంగంలో దిగి పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో శాసనసభ సమావేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇద్దరు నేతల మధ్యా అధిష్ఠానం సయోధ్య కుదిర్చింది. దాని ప్రకారం పంతాన్ని పక్కనపెట్టి సీఎల్పీకి పైలట్‌ తన వర్గీయులతో కలిసి వచ్చారు. పార్టీ పరిశీలకులు రణదీప్‌ సూర్జేవాలా, అజయ్‌ మకెన్‌, కె.సి.వేణుగోపాల్‌లతో కలిసి గహ్లోత్‌, పైలట్‌.. కెమెరాలకు ఫోజులిచ్చారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతిఒక్కరి సమస్యనూ పరిష్కరిస్తానని గహ్లోత్‌ భరోసా ఇచ్చారు. సర్కారు కూల్చివేతకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. వేర్వేరు శిబిరాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా తిరిగి జైపుర్‌కు చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని