Updated : 11 Sep 2020 19:20 IST

ఇది అంతం కాదు..ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

సాధ్యమైనంత త్వరగా సమగ్ర భూసర్వే
నూతన రెవెన్యూ బిల్లుపై చర్చలో సీఎం

హైదరాబాద్‌: పేదలను కాపాడటంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ (రిజర్వేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) భూములను పరిరక్షిస్తామని చెప్పారు. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద ఇచ్చిన పత్రాలు పట్టా సర్టిఫికెట్లు కావని.. ప్రజలు ఆ భ్రమల్లో ఉండొద్దన్నారు. నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. బిల్లుపై ఇతర సభ్యులు ఇచ్చిన సభ్యులను స్వీకరిస్తామని చెప్పారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగన్నారు. ఈ కొత్త చట్టం అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా ఈ బిల్లులో దృష్టి సారించామన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారని సీఎం చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌గా ధరిణి పోర్టల్‌ను రూపొందించామన్నారు. ధరణి పోర్టల్‌లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్‌ కేటాయించామన్నారు. ఈ పోర్టల్‌ను రెవెన్యూ శాఖే నిర్వహిస్తుందని తెలిపారు. 

రెండు రకాలుగా పాస్‌బుక్‌ల వర్గీకరణ

వ్యవసాయ భూమికి ఆకు పచ్చ, వ్యవసాయేతర భూమికి ముదురు ఎరుపు రంగు పాస్‌బుక్‌ పంపిణీ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచన మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకూ రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్‌కి అయినా వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి అని చెప్పారు. 

పంపిణీకి ప్రభుత్వ భూమి లేదు

రాష్ట్రంలోని 87వేల ఎకరాల దేవాదాయ భూములు, 55వేల ఎకరాల వక్ఫ్‌ భూములు ఆక్రమణల్లో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వక్ఫ్‌, దేవాదాయ భూములను రక్షిస్తామన్నారు. రేపటి నుంచి వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో పాటు గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులను నిలివేస్తున్నట్లు స్పష్టం చేశారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పబోమని.. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని సీఎం తేల్చిచెప్పారు. భూముల క్రమబద్ధీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామన్నారు. కౌలు దారీ వ్యవస్థను పట్టించుకోమన్నారు. ఒకప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు భూమి శిస్తు అని.. ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ప్రభుత్వమే రైతుబంధు అందిస్తున్నపుడు అనుభవదారు కాలమే అవసరం లేదన్నారు. జాగీర్దార్ల వ్యవస్థ ఉన్నపుడు అనుభవదారు కాలం సరైనదేని..ఇప్పుడు దానితో సన్న, చిన్నకారు రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. 

వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ

రాష్ట్రంలో 57.90 లక్షల మంది రైతులకు చెందిన కోటి 48లక్షల 57 వేల ఎకరాల భూమికి రైతుబంధు అందించామని కేసీఆర్‌ తెలిపారు. కేవలం 48 గంటల్లో రూ.7,200 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబంధు పరిహారం ఒకరిది మరొకరికి వెళ్లిందా అనే అంశంపై విచారణ చేయించానన్నారు. పరిహారం అలా వెళ్లి ఉంటే చాలా గొడవలు జరిగేవని చెప్పారు. రైతుబంధు ప్రకారం వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువన్నారు. భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే సరైన మార్గమని.. వీలైనంత త్వరగా దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుందన్నారు. రెండు లేదా మూడు మినహా మిగిలిన చట్టాలను తీసేయడం లేదన్నారు. 

పీడ విరగడైందని ప్రజలు భావిస్తున్నారు

గత ప్రభుత్వాలు అవలంభించిన భూ విధానం అశాస్త్రీయంగా ఉందని సీఎం అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే పట్టాల పంపిణీ జరిగేదని.. స్థలాలు, హద్దులు చూపకుండానే వాటిని పంపిణీ చేశారని గుర్తు చేశారు. పంచిన భూమి తక్కువ.. పంపిణీ కాగితాలే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. అశాస్త్రీయంగా జరిగిన భూ పంపిణీతో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అటవీ భూముల్లో రాజకీయ దందా చేశారని సీఎం విమర్శించారు. కొత్త రెవెన్యూ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడంతో ప్రజలంతా బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకొంటున్నారని కేసీఆర్ చెప్పారు. దీనిపై ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తోందని.. పీడవిరగడైందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు అండదండగా ఉండటమే తమ విధానమన్నారు. మంచి వ్యవస్థ వచ్చినపుడు కొంత కఠినంగా ఉంటుందని.. ఆ పరిస్థితి తప్పదన్నారు. 

 

 

 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని