సీఎం అభ్యర్థి కన్నా ‘నోటా’కే ఎక్కువ ఓట్లు!

ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పైచేయి సాధించింది. జేడీయూ కన్నా భాజపాకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ సంకీర్ణాల చాణుక్యుడిగా పిలవబడే నీతీశ్‌కే మరోసారి సీఎం పీఠం దక్కడం విశేషం. అయితే, ఈ .........

Published : 11 Nov 2020 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్కంఠ రేపిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే పైచేయి సాధించింది. జేడీయూ కన్నా భాజపాకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ సంకీర్ణాల చాణుక్యుడిగా పిలవబడే నీతీశ్‌కే మరోసారి సీఎం పీఠం దక్కడం విశేషం. అయితే, ఈ ఎన్నికల్లో 7లక్షల మందికి పైగా ఓటర్లు ఏ అభ్యర్థి పట్లా ఆసక్తి ప్రదర్శించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 7,06,252 (1.7శాతం) మంది ఓటర్లు ‘నోటా‘ (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) మీట నొక్కడం అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. అలాగే, ఈ ఎన్నికల్లో లండన్‌ నుంచి వచ్చి ప్లూరల్స్‌ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన 28 ఏళ్ల పుష్పమ్‌ ప్రియ చౌధురి ఘోరంగా ఓటమి చవిచూశారు. రెండు స్థానాల నుంచి పోటీచేసిన ఆమె ప్రత్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఒకచోట నోటా కన్నా తక్కువ ఓట్లు రాగా.. మరో స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కలేదు.

దర్భంగాకు చెందిన పుష్పమ్‌ ప్రియా చౌధురి జేడీయూ సీనియర్‌ నేత వినోద్‌ చౌధురి కుమార్తె. లండన్‌లో స్థిరపడిన ఆమె తండ్రి ఎమ్మెల్సీగా ఉన్న పార్టీలో చేరకుండా ఈ ఎన్నికల్లో ‘ప్లూరల్స్‌’ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఇటీవలే బిహార్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. బిహార్‌ అభివృద్ధి కోసం ప్రజలు తనకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. తాను సీఎం అయితే 2025 నాటికి బిహార్‌ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్న హామీతో ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రజలు ఆమెను ఆదరించలేదు. బిస్ఫీ నియోజకవర్గంలో పుష్పం ప్రియకు 1521 ఓట్లు రాగా.. ఆరో స్థానంలో నిలిచారు. ఇక్కడ భాజపా అభ్యర్థి హరిభూషణ్‌ ఠాకూర్‌కు 86వేల పైచీలుకు ఓట్లు రాగా.. నోటాకు 2929 ఓట్లు రావడం గమనార్హం.  అలాగే, మరో స్థానం బంకీపూర్‌లో 5189 ఓట్లతో ఆమె పదో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ నోటాకు 1213 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ప్రియ భాజపా చేతిలోనే ఓడిపోయారు.

నోటాకు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. 
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ‘నోటా’కు భారీగానే ఓట్లు వచ్చాయి. బిహార్‌లో మొత్తం 243 స్థానాల్లో  7,06,252 (1.69 శాతం) మంది ఓటర్లు  ‘నోటా’(నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) మీట నొక్కినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2013లో నోటా ఎంపికను ఓటింగ్‌ యంత్రాల్లోకి చేర్చిన విషయం తెలిసిందే.
* తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో నోటాకు 554 ఓట్లు వచ్చాయి.
* మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 39,787 ఓట్లు పడ్డాయి
* గుజరాత్‌లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నోటాకు 24,732 ఓట్లు వచ్చాయి.
* ఛత్తీస్‌గఢ్‌ ఒక స్థానంలో 3,787 ఓట్లు
* హరియాణాలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా నోటాకు 5003 ఓట్లు పడ్డాయి.
* ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో 5773 ఓట్లు
* కర్ణాటకలో రెండు స్థానాల్లో 3140 ఓట్లు
* మణిపూర్‌లో ఐదు స్థానాల్లో 522 ఓట్లు
* నాగాలాండ్‌లో రెండు స్థానాల్లో 4773 ఓట్లు
* ఒడిశాలో రెండు స్థానాల్లో  1486 ఓట్లు
* యూపీలో ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు 8755 ఓట్లు పడ్డాయి.
* బిహార్‌లోని వాల్మికినగర్‌ లోక్‌సభ  ఉప ఎన్నికలో నోటాకు 41041ఓట్లు పడ్డాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు