బిహార్‌ ఎన్నికల ప్రచారం సమాప్తం

బిహార్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరిది, మూడో దశ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. మొత్తం 19 జిల్లాల పరిధిలోని 78 స్థానాలకు.....

Updated : 05 Nov 2020 18:15 IST

పట్నా: బిహార్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరిది, మూడో దశ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. మొత్తం 19 జిల్లాల పరిధిలోని 78 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్‌ జరగనుంది. 1200 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.35 కోట్ల మంది ఓటర్లు ఆ రోజు నిర్ణయించనున్నారు. ఈ దశ బరిలో సభాపతి సహా పలువురు కేబినెట్‌ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే తరఫున ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటించారు. మారుమూల జిల్లాలైన అరారియా, సహస్రలో మొత్తం 12 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. నీతీశ్‌కు ఓటేసి అభివృద్ధి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. మహా కూటమి తరఫున రాహుల్‌ గాంధీ సైతం మాధేపుర, అరారియా జిల్లాల్లో ఎన్నికల సభల్లో పాల్గొని ఈవీఎంలను ఎంవీఎం (మోదీ ఓటింగ్‌ మెషిన్‌)లతో పోల్చారు. భాజపా సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంలో భాగస్వాములయ్యారు.

ఇక సీఎం నీతీశ్‌ కుమార్‌, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ సైతం విస్తృతంగా పర్యటించారు. మరోవైపు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ సభలకూ పెద్ద ఎత్తున జనం హాజరవ్వడం కనిపించింది. ముస్లిం ఓటర్లు ప్రధానంగా ఉండే సీమాంచల్‌ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు పార్టీల కూటమి తరఫున ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కొవిడ్‌ వేళ జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో తెలియాలంటే ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని