
విపక్షాలది కపట బుద్ధి: జావడేకర్
భారత్ బంద్‌కు మద్దతివ్వడంపై కేంద్రం మండిపాటు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు, వారు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలిపిన విపక్షాలపై కేంద్రం మండిపడింది. ఈ విషయంలో విపక్షాలు కపటబుద్ధిని ప్రదర్శిస్తున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఒప్పంద సేద్యాన్ని చట్టంగా తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలోనూ ఈ చట్టాలపై హామీ ఇచ్చిందని తెలిపారు. రైతులు వారు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తాన్ని ధర రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అందుకనుగుణంగా పంట సాగుకయ్యే ఖర్చు కంటే 50శాతం అదనంగా ధర రూపంలో చెల్లిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కనీసం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం విపక్షాలకు పరిపాటిగా మారిందని మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. దీని వల్ల దేశ ప్రతిష్ఠ మసకబారుతోందన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్రంతో జరిపిన పలు దఫాల చర్చలు విఫలమవడంతో వారు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పలు పార్టీలు వారికి మద్దతుగా నేడు బంద్‌లో పాల్గొన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలపై కేంద్రం విరుచుకుపడింది.
ఇవీ చదవండి..
భారత్ బంద్.. లైవ్ అప్డేట్స్
గృహనిర్బంధంలో కేజ్రీవాల్: ఆప్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.