చాలా మందిని చూశా..బీకేర్‌ఫుల్‌: చంద్రబాబు

రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే ఆ విషయంపై చర్చించకుండా అధికార వైకాపా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పంటల బీమా కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు.

Updated : 01 Dec 2020 13:57 IST

సీఎం అసమర్థతతో రైతాంగం నష్టపోతోంది

వరికి రూ.30వేలు, ఉద్యానపంటలకు రూ.50వేలు అందించాలి

తొలిసారి సభ నుంచి సస్పెండ్‌ అయ్యా

ప్రతిరోజూ అవమానాలు భరించాలా?

శాసనసభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు నిప్పులు

అమరావతి: రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే ఆ విషయంపై చర్చించకుండా అధికార వైకాపా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. పంటల బీమా కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెందిన పంటల బీమాను ఎందుకు క్లెయిమ్‌ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా నేతలు అసెంబ్లీలో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. శాసనసభకు ఆలస్యంగా వచ్చే ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నానని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. తెదేపా సభ్యుడు రామానాయుడు సభలో మాట్లాడినపుడు ‘పైకంపార్ట్‌మెంట్‌లో ఏమీలేదు..’ అంటూ ఆయన్ను ఉద్దేశించి జగన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎంకు ఇంగిత జ్ఞానం ఉందా?మాట్లాడే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. సభలో వైకాపా సభ్యులు నీచంగా మాట్లాడారని ఆరోపించారు.   

జగన్‌..ఫేక్‌ ముఖ్యమంత్రి

‘‘రాష్ట్రంలోని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. పంట నీటిలోనే కుళ్లిపోవడంతో పాటు కొన్నిచోట్ల ధాన్యం మొలకలు వచ్చాయి. ఇలాంటి అంశంపై చర్చ చేపట్టి ఎంత పరిహారం ఇస్తారనేది చెప్పాల్సింది పోయి మాపైనే ఎదురుదాడి చేస్తారా? సీఎం జగన్‌ చేతగానితనం, అసమర్థత, అహం వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోతోంది. వారి ఉసురు తగులుతుంది. ఈ ఏడాదిన్నరలో ఏడుసార్లు వరదలు వచ్చాయి. ఈ ఏడాది రూ.1300 కోట్లు కట్టి ఉంటే కనీసం రూ.3, రూ.4వేల కోట్ల ఇన్సూరెన్స్‌ రైతులకు వచ్చేది. ఉన్న వ్యవస్థను కుప్ప కూల్చి కొత్త వ్యవస్థ తెస్తామంటూ ఉత్తి మాటలు చెబుతున్నారు. జగన్‌..ఫేక్‌ ముఖ్యమంత్రి. నా జీవితంలో తొలిసారి స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లా. మమ్మల్ని సస్పెండ్‌ చేస్తారా? గాలివాటంగా వచ్చారు.. అలాగే పోతారు. మీకు సంప్రదాయం, పద్ధతులు తెలియవు. మీరు చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారా?’’

ఏం చేస్తారు నన్ను.. చంపేస్తారా?

‘‘ఎందుకు మూడు ఛానళ్లను రానివ్వకుండా చేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేం సాక్షిని అలా చేయలేదే! 2430 జీవోతో మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తారా? ఎవరిచ్చారు మీకు ఆ అధికారం? ‘నేనేమైనా చేస్తాను.. చలామణి అవుతుంది’ అని అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్టప్రకారం చేస్తామంటే జరగదు. అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్తి చేస్తారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి. ఫేక్‌ ఫెలోస్‌ వచ్చి రాష్ట్ర భవిష్యత్‌తో ఆడుకుంటారా? మమ్మల్ని అవమానిస్తారా? నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు! ఏం చేస్తారు నన్ను.. చంపేస్తారా? రైతులకు తీవ్రనష్టం వాటిల్లితే దానిపై చర్చించకుండా వక్రీకరించి మీ ఇష్టప్రకారం మాట్లాడతారా? ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వరా? ప్రతిరోజూ అవమానాలు భరించాలా? ప్రజల కోసం పోరాడుతున్నా. వారి కోసమే నా జీవితంలో ఎప్పుడూ లేని తిట్లు, అవమానాలు జరుగుతున్నా భరిస్తున్నా. వైకాపా సభ్యులు సభలో ఇష్టానుసారం వెకిలినవ్వులు నవ్వుతారా? బీ కేర్‌ఫుల్‌! చాలా మందిని చూశా’’ అంటూ తీవ్రస్థాయిలో సీఎం జగన్‌, వైకాపా సభ్యులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

మేం విద్యార్థులం.. మీరు బడిపంతుళ్లా?

‘‘ప్రధాని జినోమ్‌వ్యాలీకి వస్తే నేనే సంతోషపడ్డా. ఆ పేరు కూడా నేనే పెట్టా. ఇప్పుడు అక్కడ 4-5లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. హైటెక్‌ సిటీని బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. అమరావతి చేసిన పాపమేంటి? దాన్ని నాశనం చేసి డ్రామాలు ఆడుతారా? మీ ఉన్మాద చేష్టలకు అంతులేదా? విశాఖలో జరిగిన అవకతవకలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా? ప్రతిపక్ష నేతలను అవమానపరచాలంటే భయపడతారు. ఇలాంటి దుస్సంప్రదాయాలు దేశంలో ఎక్కడా లేవు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇలాగే చేస్తే హెచ్చరించా. వెంటనే ఆయన సభలో లేచి ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు. ఆయనకు ప్రజలంటే భయముండేది. జగన్‌కు అలా లేదు. సభలో సస్పెండ్‌ చేసింది మమ్మల్ని కాదు.. రైతులను. రైతులనే అవమానపరిచారు. సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మీరు చెప్పింది వినడానికి మేం విద్యార్థులం.. మీరు బడి పంతుల్లా?పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి. వరి హెక్టారుకు రూ.30వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేలు అందించాలి. ప్రతి కుటుంబానికి రూ.10వేలు, కులవృత్తుల వారికి రూ.15వేలు ఇవ్వాలి. రైతుల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తాం. నా జీవితంలో తొలిసారి సభ నుంచి సస్పెండ్‌ అయ్యా. ఎప్పుడూ అసెంబ్లీలో ఇన్ని అవమానాలు పడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. దీనికి అంతం లేదా? ప్రజలే అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో అమలు చేయాల్సింది రాజారెడ్డి రాజ్యాంగం కాదు.. అంబేడ్కర్‌ రాజ్యాంగం’’ అంటూ మండిపడ్డారు.
 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని