Updated : 03 Dec 2020 11:02 IST

పోలవరంపై కేంద్రాన్ని ఒప్పించారా?:చంద్రబాబు

రాష్ట్రం చేతికి రాకుంటే ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేది
ఇష్టారీతిన వ్యవహరిస్తే కేంద్రం నిధులివ్వదని హెచ్చరిక

అమరావతి: పోలవరంపై వైకాపా నేతలు నీచమైన రాజకీయం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం.. ఎందుకు నిరూపించలేకపోయిందని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడు ముంపు మండలాలను తీసుకురాకపోయుంటే పోలవరం నిర్మాణం సాధ్యమయ్యేదే కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ సమస్యను అధిగమించామని చెప్పారు. ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తి, మనపై ఉన్న గౌరవంతో నీతిఆయోగ్‌ అప్పటి వైస్‌ఛైర్మన్‌ పనగరియా నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పగించారన్నారు. ఆరోజు పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేతికి రాకపోయుంటే 16 జాతీయ ప్రాజెక్టులకు పట్టిన గతే దీనికీ ఉండేదన్నారు. సరైన విధంగా శ్రద్ధపెట్టకపోవడంతో 16 ప్రాజెక్టుల్లో ఇప్పటికీ 30 శాతం పనులు పూర్తికాలేదని చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే ఆ ఖర్చును భరించి రీయింబర్స్‌ చేసేలా ఎప్పటికప్పుడు నిధులు తెచ్చుకున్నామని వివరించారు. అలా జరగకపోతే నిర్మాణం చాలావరకు ఆలస్యమయ్యేదన్నారు.

వైఎస్‌కు ముందే అంజయ్య శంకుస్థాపన చేశారు

వైకాపా నేతలు ఫేక్ ‌న్యూస్‌ ప్రచారం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అవినీతిపరుడు కాబట్టే అందరూ అలాగే ఉంటారనుకుంటున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు కొత్త కాంట్రాక్టర్‌ను  ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. రివర్స్‌ టెండరింగ్‌తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుందన్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వకుండా విద్యుత్‌ ప్లాంట్‌ కట్టినా ఉపయోగం లేదని చెప్పారు. నీళ్లు లేకుండా విద్యుత్‌ ప్లాంట్‌ ఎందుకని ప్రశ్నించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ఎప్పటిలోగా ఇస్తారు?భూసేకరణ, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారో స్పష్టం చేయాన్నారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే కేంద్రం నిధులివ్వదని చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ముందే అప్పటి సీఎం అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. నిధులపై కేంద్రాన్ని ఒప్పించారా? అని ప్రశ్నించారు. దానిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తమపై అసత్యాలతో వైకాపా నేతలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని