కేసుల భయంతో సరెండర్‌ అయ్యారు: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై

Updated : 03 Dec 2020 01:08 IST

పోలవరంపై అసెంబ్లీలో చర్చ
22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారన్న ప్రతిపక్ష నేత 

అమరావతి: వైకాపా ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై కేంద్రాన్ని అడగలేక సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. శాససనభ శీతాకాల సమావేశాల్లో భాగంగా మూడోరోజు పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైకాపా చెప్పిన మాటలన్నీ విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించారని.. పోలవరం పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి పోలవరం నిధులు సాధిస్తారా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 22 ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరం భూసేకరణ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  దీనిపై కేంద్రాన్ని ఒప్పించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే మేం పోరాడతాం, సాధిస్తామని చెప్పారని.. ఇప్పుడు నాటకాలాడొద్దని తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. 

అన్ని అనుమతులూ వైఎస్‌ హయాంలోనే: జగన్‌

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే దాదాపు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఒక కళ అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశామని.. ఏ ఒక్కరూ ఆ ప్రాజెక్టు పనులు చేసేందుకు అడుగులు ముందుకు వేయలేదని చెప్పారు. 1995-2000 సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నా అప్పుడూ పోలవరం గురించి ఆలోచన చేసే పాపాన పోలేదని ఆక్షేపించారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా.. ఎగువన ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోలేదని జగన్‌ ఆరోపించారు. ఆ తర్వాత వైఎస్‌ సీఎం అయ్యాక 2004లో పోలవరం కుడి కాలువకు 10,627 ఎకరాలు అంటే దాదాపు 80 శాతం భూసేకరణ చేసి యుద్ధప్రాతిపదికన పనుల చేపట్టారని వివరించారు. 70 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెబుతున్నారని.. ఏవిధంగా అయ్యాయని జగన్‌ ప్రశ్నించారు. పోలవరంను ఏటీఎంగా మార్చేశారంటూ చంద్రబాబుపై ప్రధాని మోదీ ఏకంగా ఎన్నికల ప్రచారసభల్లో చెప్పారని.. ప్రధానే స్వయంగా చెప్పారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.1,343 కోట్ల ప్రభుత్వానికి ఆదా అయ్యేలా చేశామని జగన్‌ వివరించారు. ఎక్కడ చంద్రబాబు ఉంటే అక్కడ దిగజారిన రాజకీయాలు కనిపిస్తాయని సీఎం విమర్శించారు. 

అంతకుముందు నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసేది తమ ప్రభుత్వమేనన్నారు. మార్చి నాటికి 17,500 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఐదేళ్లలో ఏనాడైనా ఆర్‌అండ్‌ఆర్‌ గురించి ఆలోచించారా? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 2022 ఖరీఫ్‌ నాటికి నీళ్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి సరెండర్‌ అవుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అనిల్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడే ఆమెను జగన్‌ ఎదిరించారన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని