ప్రతి అంశంలోనూ స్పష్టతివ్వాలి: శ్రీధర్‌బాబు

ప్రభుత్వం శాసనసభలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులో రికార్డింగ్‌ అథారిటీని ప్రస్తావించలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు.

Published : 11 Sep 2020 16:28 IST

నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో చర్చ

హైదరాబాద్‌: ప్రభుత్వం శాసనసభలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులో రికార్డింగ్‌ అథారిటీని ప్రస్తావించలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, పార్టీషన్‌ డీడ్‌ అంశాలని స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభలో నూతన రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో శ్రీధర్‌బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. జాగీర్‌ అనే పదానికి ఇప్పటి వరకు నిర్వచనం లేదని.. జాగీర్‌ భూముల అంశాన్ని పరిశీలించాలని శ్రీధర్‌బాబు కోరారు. పేర్లు, వివరాల నమోదులో అక్షర దోషాలు ఉంటే ఎవరు సరిచేయాలనేదానిపై బిల్లులో స్పష్టత ఇవ్వలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రతి అంశంలోనూ స్పష్టత ఇస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16వేల కేసులు ఉన్నాయని.. ప్రతి వెయ్యి కేసుల పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం సంతోషకరమన్నారు.  ఇప్పటి వరకు తహసీల్దార్‌, ఆర్డీవో దగ్గర నమోదు కాని అనేక రికార్డులు ఉన్నాయని.. వాటిపైనా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు.

ప్రతి రైతుకూ రైతుబంధు అందాలి:  సండ్ర

రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రైతుబంధు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన వివరాల ఆధారంగా రైతుబంధు ఇవ్వాలని.. సర్వే వ్యవస్థలోని లోపాలను అధిగమించాలని ఆయన సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో కొందరికి రైతుబంధు అందడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులందరికీ పాసు పుస్తకాలు అందేలా చూడాలన్నారు. పోడు భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీశాఖకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటికి పరిష్కారం చూపాలని సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

సంస్కరణలకు మారుపేరు కేసీఆర్‌: దానం

రాష్ట్రంలో సంస్కరణలకు మారుపేరు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో కేసీఆర్‌ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆయన కొనియాడారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో వారికి ఎలాంటి నష్టం జరగకుండా సీఎం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంపై అభినందనలు తెలిపారు. రెవెన్యూశాఖలో ఉన్న కొన్ని లోపాలను సవరించాలని దానం కోరారు. ధరణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయాలన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని