
కర్ణాటక విధాన పరిషత్‌లో బాహాబాహీ
డిప్యూటీ ఛైర్మన్‌ను లాక్కెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
బెంగళూరు: కర్ణాటక విధానపరిషత్‌లో రసాభాస చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పరిషత్ డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. అక్కడి సభ్యులంతా పరస్పరం బాహాబాహీకి దిగారు. కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునేందుకు భాజపా సభ్యులు యత్నించారు. సభలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భాజపా, జేడీఎస్‌లు ఛైర్మన్‌ను అక్రమంగా ఆస్థానంలో కూర్చోబెట్టాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలని విమర్శించింది. భాజపా, జేడీఎస్‌లు రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడ్డాయని, తప్పును సరిదిద్దేందుకే ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది.
ప్రస్తుతం కర్ణాటక విధానసభలో అధికార పక్షం భాజపా బలం కొనసాగుతుండగా.. పరిషత్‌లో మాత్రం విపక్ష సభ్యుల బలం ఉంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా 4 స్థానాలు గెలుచుకొని పెద్దల సభలో తమ బలాన్ని 31కు పెంచుకుంది. ఈ సంఖ్య నిర్ణయాత్మకం కాకపోవటంతో రాజకీయ ఆధిపత్యం చేతులు మారుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కాలంలో పరిషత్తులో విపక్షాల ఆధిపత్యం జోరుగా సాగింది.
అదీ కాంగ్రెస్ ఎత్తుగడ
పరిషత్తులో సభాధ్యక్ష స్థానాన్ని దక్కించుకుని అధికార పక్షానికి దీటైన సమాధానం ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. భాజపాను అడ్డుకోవాలంటే జేడీఎస్ సహకారం తప్పనిసరి. ఇప్పటికే పరిషత్తులో ఏపీఎంసీతో పాటు పలు కార్మిక బిల్లుల ఆమోదానికి జేడీఎస్ సహకరించటంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. పరిషత్తు తాజా సమావేశంలో జేడీఎస్ సభ్యుల నుంచి మద్దతు దక్కించుకుంటే అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది. మైత్రి సర్కారు సమయంలో పరిషత్తు అధ్యక్ష స్థానాన్ని తమకు ఇవ్వాలని జేడీఎస్ పట్టుబట్టినా కాంగ్రెస్ నిరాకరించింది. కాంగ్రెస్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాత మిత్రుడికి శాశ్వత ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే రసాభాస చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
మక్కల్ సేవై కట్చి.. రజనీ పార్టీ ఇదేనా?
కరోనా టీకా: అంతేనా.. అసలు నొప్పే లేదు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.