సీట్ల పంపకంలో ఆలస్యం వల్లే ఓటమి

సీట్ల పంపకంలో ఆలస్యం జరగడం వల్లే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  మహా కూటమి ఓటమి పాలైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌.....

Published : 16 Nov 2020 01:35 IST

దిల్లీ: సీట్ల పంపకంలో ఆలస్యం జరగడం వల్లే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  మహా కూటమి ఓటమి పాలైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ అన్నారు. దీన్నుంచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రదర్శన చాలా పేలవంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఫలితాలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని, దీనిపై ఆత్మపరిశీలన, సమగ్ర విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాలపై ఆయన ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అనుకున్నదానికంటే తక్కువ సీట్లు వచ్చాయని అన్వర్‌ పేర్కొన్నారు. 70 స్థానాల్లో కనీసం 50 శాతం సీట్లు వస్తాయని అంచనా వేశామని చెప్పారు. మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత కూడా ఉందని అంగీకరించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో సీట్ల పంపకం కూడా మహా కూటమి ఓటమికి కారణమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జులై నాటికే సీట్ల పంపకం పూర్తి చేయాలని ఓ దశలో రాహుల్‌ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. కానీ, ఎన్నికలు దగ్గరపడ్డాక సీట్లు ఖరారు చేయడం ఓటమికి కారణమైందని చెప్పారు.

వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్వర్‌ చెప్పారు. మహా కూటమి ఓటమి వెనుక ఎంఐఎం పాత్ర కూడా ఉందని చెప్పారు. ఒక పార్టీని ఎన్నికల్లో పోటీ చేయొద్దని తాము అనబోమన్నారు. సీమాంచల్‌లో ఆ పార్టీ 5 సీట్లే గెలిచినప్పటికీ 15 సీట్లలో మహా కూటమి ఓట్లను చీల్చిందని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా అది భాజపాకు కలిసొచ్చిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు